అధికార వైసీపీ మొన్నటి ఎన్నికల్లో గెలిచిందంటే ప్రధాన కారణంగా టీడీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలు.. పూర్తిగా వైసీపీ వెంట నడవడమే.. రెండేళ్లు అయినా వైసీపీకే ఓటేస్తున్న వారిని తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ బీజేపీ-జనసేన కూటమి వైపు విజయవంతంగా మరల్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ ప్రత్యేకంగా చేసిన ప్రసంగం ఖచ్చితంగా వారిలో మార్పునకు కారణం అవుతుందని అంటున్నారు. ఇంతకీ పవన్ ఏం మాట్లాడాడు? ఏ విధంగా కులాలను ఆకర్షించాడన్నది తరచిచూస్తే..
జనసేనాని.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుమల ప్రచారంలో బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. తిరుమలలో బలిజలు, ఇతర కులస్థులను వైసీపీ నేతలు అవమానిస్తున్నారని.. వారికి అండగా ఉంటామని.. బెదిరిస్తే భయపడమని పవన్ సవాల్ చేశారు. కులాలపై దాడులను లేవనెత్తి అధికార వైసీపీకి వారిని దూరం చేసే ఎత్తుగడ వేశారు. అది సక్సెస్ అయ్యింది.
తిరుమలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. తిరుమలలో బలిజ కులస్థులను వైసీపీ నాయకులు హింసిస్తున్నారని.. చిన్న అల్ప కులాలు, అణగారిన వర్గాలను వైసీపీ నాయకులు బెదిరించడాన్ని పవన్ ఖండించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పేరిట.. ట్యాక్సీ డ్రైవర్లపై కేసులు పెడుతున్నారని ఇది ఎంతవరకు న్యాయం అని తిరుపతిలో మెజార్టీ జనాభా ఉన్న బలిజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు పవన్.
బలిజలు ఇతర అణగారిన వర్గాలను వైసీపీ నాయకులు భయపెడితే బలపడుతారు తప్ప.. భయపడరని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోయలు, యాదవులు, మాల, మాదిగలు, సంచార జాతులు, మైనార్టీలపై వైసీపీ బెదిరింపులను ఖండిస్తున్నామని.. వారికి అండగా ఉంటామని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సాధారణంగా పవన్ కులాలపై ఎక్కువగా మాట్లాడరు. కులాల కంపులోకి దిగరు. కానీ తిరుమలలో బలిజలపై వైసీపీ దాడులను ఎలుగెత్తి చాటి తిరుపతిలో మెజార్టీ ఉన్న వారి ఓటు బ్యాంకును బీజేపీ వైపు మళ్లించడంలో పవన్ సక్సెస్ అయ్యారని చెబుతున్నారు.
జనసేనాని పవన్ తిరుపతి సభ బీజేపీలో ఉత్సాహం నింపింది. ఎవరిని అయితే టార్గెట్ చేయాలో వారినే చేసింది. బలిజలు, ఇతర కులాలను ఆకర్షించడంలో పవన్ విజయవంతమయ్యారు. అలాగే ఇన్నాళ్లు వైసీపీ వెంట ఉన్న వారిని బీజేపీ వైపు మరల్చడంలో వైసీపీని విలన్ ను చేయడంలో పవన్ సక్సెస్ అయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు.