ఏపీ సీఎం జగన్ తో ఢీ అంటే ఢీ అంటూ ముచ్చెమటలు పట్టిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాజాగా మరో లేఖాస్త్రంతో జగన్ కు షాకిచ్చారు. పంచాయితీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఈరోజు మొదలైన వేళ జగన్ సర్కార్ ను ఇరుకునపెట్టే నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా ఏపీ సీఎస్ ఆధిత్యనాథ్ దాస్ కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరో లేఖ రాశారు. పంచాయితీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. ఈ సమయంలో ప్రభుత్వం జారీ చేస్తున్న కుల ధ్రువీకరణ పత్రాలు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ల మీద సీఎం జగన్ ఫొటోలను తొలగించాలని లేఖలో ఆదేశించారు. నామినేషన్ వేసే అభ్యర్థులకు తహసీల్దార్లు జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్ఓసీలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటో ఉండడం ఎన్నికల నియమావళికి విరుద్ధం అని ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖలో పేర్కొన్నారు. తహసీల్దార్లందరికీ ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ కు సూచించారు.
ఎన్వోసీలు, కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ ఆధిత్యనాథ్ దాస్ కు సూచించారు. ఇక పంచాయితీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు జారీ చేసే సర్టిఫికెట్ల విషయంలో ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా చూడాలని పేర్కొన్నారు.
ఏపీలో జగన్ సర్కార్ టార్గెట్ గా ఎస్ఈసీ నిమ్మగడ్డ చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ సీరియస్ గా ముందుకెళుతున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి చిన్న విషయంపైన దృష్టి పెడుతున్నారు.