దేశంలో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజల నుంచి ధనవంతుల వరకు ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ వినియోగం సాధారణం అయిపోయింది. సాధారణంగా గ్యాస్ సిలిండర్ ధర 700 రూపాయలకు అటూఇటుగా ఉంటుంది. ఆ మొత్తాన్ని చెల్లిస్తే మాత్రమే గ్యాస్ సిలిండర్ డెలివరీ తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది వినియోగదారులు ఆఫ్ లైన్ లో నగదును చెల్లించడం వల్ల ఆన్ లైన్ లో అదిరిపోయే క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నా వాటిని పొందలేక నష్టపోతూ ఉంటారు.
అయితే కొన్ని టిప్స్ పాటించడం వల్ల గ్యాస్ సిలిండర్ బుకింగ్ సమయంలో 50 రూపాయల నుంచి 500 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది. గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ యాప్స్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కల్పిస్తున్నాయి. మోదీ సర్కార్ దేశంలో డిజిటల్ పేమెంట్స్ ను పెంచాలని భావిస్తున్న సంగతి విదితమే. ఆయిల్ కంపెనీలు సైతం మోదీ సర్కార్ ఆలోచనలకు అనుగుణంగా డిజిటల్ పేమెంట్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నాయి.
భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, హిందుస్తాన్ పెట్రోలియం లాంటి ప్రముఖ సంస్థలు వినియోగదారులకు ప్రయోజనం చేకూరే విధంగా క్యాష్ బ్యాక్ ను అందిస్తున్నాయి. అయితే ఎవరైతే ఆన్ లైన్ లో గ్యాస్ సిలిండర్ బిల్లును చెల్లిస్తారో వాళ్లు మాత్రమే క్యాష్ బ్యాక్ ను పొందడానికి అర్హులవుతారు. కంపెనీ వెబ్ సైట్ల ద్వారా లేదా యూపీఐ యాప్స్ సహాయంతో గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకుంటే సులువుగా క్యాష్ బ్యాక్ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.
ఇతర యాప్స్ తో పోల్చి చూస్తే పేటీఎం యాప్ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్ ను అందిస్తోంది. యూపీఐ యాప్స్ ఉపయోగించని వాళ్లు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ సహాయంతో గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ నెల ఒకటో తేదీ నుంచి దేశంలోని పలు నగరాల్లో ఓటీపీ చెబితేనే సిలిండర్ డెలివరీ చేస్తున్న సంగతి తెలిసిందే.