ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. విజయనగరం మినహా.. 12 జిల్లాల్లో తొలిదశ ఎన్నికలు జరుగుతాయి. ప్రతీరోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. సర్పంచ్ పదవితోపాటు ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో నిర్ధారించిన వార్డు సభ్యల పదవులకు కూడా నామినేషన్లు తీసుకుంటారు.
తొలిదశలో 18 రెవెన్యూ డివిజన్లలోని 168 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలివిడతలో 3249 గ్రామ పంచాయతీలు, 32,504 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 4 వరకు గడువు కాగా,ఫిబ్రవరి 9న తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉ.6:30 నుంచి మ.3:30 వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది.. అదేరోజు కౌంటింగ్ నిర్వహిస్తారు.
ఇక విజయనగరం, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో డివిజన్ల వారీగా నాలుగు విడతల్లో జరిగే ఎన్నికల తేదీలు మారాయి. పశ్చిమ గోదావరి జిల్లా తొలివిడతలో నరసాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో.. రెండో విడతలో కొవ్వూరు, మూడో విడతలో జంగారెడ్డిగూడెం, నాలుగో విడతలో ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికలు జరుగుతాయి. విజయనగరం జిల్లా రెండో విడత పార్వతీపురం.. 3,4 విడతల్లో విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికలు జరుగుతాయి. ప్రకాశం జిల్లా.. తొలి విడతలో ఒంగోలు, రెండో విడతలో కందుకూరు, ఒంగోలు, మూడో విడతలో కందుకూరు.. నాలుగో విడతలో మార్కాపురం డివిజన్లలో ఎన్నికలు జరుగుతాయి.
ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీకే ప్రజలు జై కొడుతున్నారని అర్థం అవుతోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయిన రోజు ఉదయాన్నే.. వైసీపీ పాలన అంటే ఏంటో చూపించారు. గ్రామాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న వలంటీర్లను సర్పంచ్ అభ్యర్థులుగా ఎన్నుకుంటున్నారు ఆయా గ్రామాల ప్రజలు. ఈ మేరకు ఉత్తమ సేవలందిస్తున్న ఓ మహిళా వలంటీర్‌ను రాప్తాడు గ్రామస్తులు సర్పంచ్ బరిలో నిలిపారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం కాగానే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అందులో భాగంగానే డిగ్రీ పూర్తి చేసిన సత్యవతి మండలంలోని ప్రసన్నాయపల్లిలో వలంటీర్ పోస్టుకు ఎంపికైంది. వలంటీర్ ఉద్యోగం రావడంతో సత్యవతి గ్రామంలో నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో ముందుండేది. ప్రభుత్వ పథకాలను సకాలంలో ప్రజలకు చేరవేసేది. ఆమె సేవలను గుర్తించిన మండల స్థాయి అధికారులు ఉత్తమ మండల వలంటీర్ అవార్డును ప్రకటించారు.
గ్రామ వలంటీర్‌గా ఉన్నప్పుడే సత్యవతి పేదలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో ముందు వరసలో ఉంటుందని గ్రహించిన గ్రామస్తులు ప్రసన్నాయపల్లి పంచాయతీ సర్పంచ్‌గా బరిలో దింపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన కూడా గ్రామస్తులు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.