పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ రమేశ్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రభుత్వం ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని ప్రచారం చేస్తుంటే.. ఇంతకు ముందు ఎన్నికల సమయంలో ఏకగ్రీవాలను ప్రోత్సహించిన 30మంది అధికారులపై ఎస్ఈసీ ఇప్పుడు వేటు వేయడం సంచలనంగా మారింది.
టీడీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో పర్యటించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే జిల్లాకు చెందిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ఆయన ఓ చిన్నపాటి యుద్ధాన్నే ప్రారంభించినట్లు కనిపిస్తోంది. మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరుతో పాటు ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి నియోజకవర్గం తంబళ్లపల్లిపై టార్గెట్ చేసినట్లు సమాచారం.
చిత్తూరు జిల్లావ్యాప్తంగా 30మంది ఎంపీడీవోలను బదిలీ చేయాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. జిల్లా మొత్తం మీద 65మంది ఎంపీడీవోలు ఉండగా.. వారిలో సగం మందిని బదిలీ చేయాలని సూచించారు. గత ఏడాది నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలల్లో ఆ ఎంపీడీవోలు ఏకగ్రీవాలను ప్రోత్సహించారనేది ఆరోపణ. అప్పుడు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించిన వారంతా.. అక్రమంగా.. నిబంధనలకు విరుద్ధంగా.. జెడ్పీటీసీ, ఎంపీటీసీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, ఆ కారణంతోనే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాజాగా బదిలీ వేటు వేసినట్లు సమాచారం.
అప్పట్లో పుంగనూరు, తంబళ్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఆరుగురి చొప్పున జెడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యారు. అలాగే వైసీపీకి చెందిన ఎమ్మెల్యే.. బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో మరో నలుగురు జెడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యరు. 858 ఎంపీటీసీ స్థానాలకు 433 చోట్ల ఏక్రగీవం అయ్యారు. ఇందుకు ఎంపీడీవోలే కారణమని భావించిన ఎస్ఈసీ వారిని బదిలీ చేయాలని ఆదేశించారు.
జెడ్పీటీసీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి కారణమయ్యారనే ఉద్దేశంతో చిత్తురు జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తాను కూడా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బదిలీ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. భరత్ గుప్తాను బదిలీ చేశారు. ఆయనను గృహ నిర్మాణ సంస్థ డైరెక్టరుగా నియమించారు. నారాయణ గుప్త స్థానంలో హరినారాయణ్ ను చిత్తూరు జిల్లా కలెక్టరుగా నియమించారు. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నిలలోనూ ఎస్ఈసీ కన్నువేశారు. ఏకగ్రీవాలను ప్రోత్సహించేది లేదని ఆయన చెబుతున్నారు.