సుప్రీంకోర్టు తీర్పునివ్వడం.. ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రతీకారం మొదలుపెట్టారు. ఇన్నాళ్లు తనకు సహకరించకుండా ముప్పుతిప్పలు పెట్టిన పంచాయితీరాజ్ శాఖ కీలక అధికారులపై ఏకంగా బ్రహ్మాస్త్రం ప్రయోగించారు
ఏపీ సీఎం జగన్ ఆదేశాల ప్రకారం నిమ్మగడ్డతో ఫైట్ కు దిగి సహకరించకుండా చూసిన పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లను బదిలీ చేస్తూ.. అభిశంసిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ఏకంగా ప్రోసిడింగ్స్ జారీ చేయడం కలకలం రేపింది. ఈ అభిశంసన ఉత్తర్వులను వారి సర్వీసు రికార్డుల్లో చేర్చాలని ఆదేశించడంతో ఆ ఉన్నతాధికారుల సర్వీసుకు పెద్ద దెబ్బగా పరిగణించింది. వారి ప్రమోషన్లు, ఇతర రిటైర్ మెంట్ తర్వాత బెనిఫిట్స్ కు తీవ్ర దెబ్బ తగులనుంది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన సహకారాన్ని, సిబ్బందిని, వనరులను ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సమకూర్చాలని హైకోర్టు ఆదేశించినా ద్వివేది, గిరిజా శంకర్ పెడచెవిన పెట్టారని.. ఎంతమాత్రం సహకరించలేదని పేర్కొన్నారు. 2021 ఓటర్ల జాబితాల్ని సిద్ధం చేయడంలో వాళ్ల నిర్లక్ష్యం వల్ల పంచాయితీ ఎన్నికల్లో 3.62 లక్షల మంది యువత ఓటు హక్కు కోల్పోతున్నారని నిమ్మగడ్డ అభిశంసన తీర్మానంలో ఆరోపించారు. వారిద్దరి వైఖరిని తప్పుపడుతూ తీవ్ర పదజాలంతో రమేశ్ కుమార్ 8 పేజీల అభిశంసన ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే ఇప్పటికే వారిద్దరిని బదిలీ చేసిన జగన్ సర్కార్ వారిపై చర్యలకు మాత్రం సిద్ధంగా లేదు. నిమ్మగడ్డ ఎన్ని తీర్మానాలు ఇచ్చినా సరే అధికారులను కాపాడుకునే ప్రయత్నాల్లోనే ఉంది. తాజాగా గవర్నర్ వద్దకు ఈ పంచాయితీ చేరింది. ఏపీలో పంచాయితీ లొల్లిపై గవర్నర్ సీరియస్ అయినట్టు తెలిసింది.
ఇవాళ రాజ్ భవన్ కు రావాల్సిందిగా ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ, ఏపీ సీఎస్ అధిత్యనాథ్ దాస్ లకు గవర్నర్ భిశ్వభూషణ్ ఆదేశించారు. ఉదయం 10.15 గంటలకు ఎస్ఈసీ నిమ్మగడ్డతో.. 10.30 గంటలకు సీఎస్ ఆధిత్యనాథ్ తో గవర్నర్ భేటి కానున్నారు. నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయాలు, బదిలీలు చేసుకుంటూ ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుకుతున్నారు. జగన్ ప్రభుత్వం సైతం వ్యూహ ప్రతివ్యూహాలతో రక్తికట్టిస్తున్నారు. ఇప్పటికే పంచాయితీ రాజ్ ముఖ్య అధికారులపై తీవ్ర చర్యలకు నిమ్మగడ్డ రెడీ అయ్యారు. దానిపై ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై గవర్నర్ ఇరు పక్షాలకు వార్నింగ్ ఇస్తారని.. సామరస్యంగా వెళ్లాలని సూచిస్తారని తెలుస్తోంది.