తాటిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడు.. ఇప్పుడు ఏపీలో ఆ యుద్ధమే నడుస్తోంది. ఏపీ సీఎం జగన్ కు.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మధ్య సాగుతున్న వైరంలో విజయం నిమ్మగడ్డదే అయినా కూడా బలమైన ఏపీ ప్రభుత్వం ఏం చేయాలో అది చేసింది. ఇప్పుడు మరిన్ని చేయడానికి రెడీ అయ్యింది. ఒక ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలదని.. నిమ్మగడ్డ ఎత్తులకు పైఎత్తులు వేయడానికి సీఎం జగన్ రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే భారీ అస్త్రాన్ని బయటకు తీశారు. ఎన్నికలను ప్రాభావితం చేస్తున్న నిమ్మగడ్డకు ఆ చాన్స్ లేకుండా చేయాలని పెద్ద ప్లాన్ వేశారు.
చంద్రబాబు నామినేట్ చేసిన నిమ్మగడ్డ సారథ్యంలో పంచాయితీ ఎన్నికలకు వెళ్లడం ఏపీ సీఎం జగన్ కు అస్సలు ఇష్టం లేదు. అయినా కూడా సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలను ప్రభావితం చేయకుండా ఏకంగా ఏకగ్రీవం చేసేలా సీఎం జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు. తాజాగా పంచాయితీలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.
రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తేనే జగన్ కు సమస్య. అందుకే పంచాయితీ ఎన్నికల్లో ఏగ్రీవాలకు జగన్ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. తద్వారా పెద్ద ఎత్తున ఏకగ్రీవాలకు పురిగొల్పింది. అసలు ఎన్నికలు జరుగకుండా ఈ స్కెచ్ గీసింది.
ఏపీలో పంచాయితీ పాలకవర్గాలు ఏకగ్రీవాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతూ జగన్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో మంచి వాతావరణం నెలకొల్పేందుకు ప్రోత్సహాకాలు ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 2వేల జనాభా ఉన్న పంచాయితీలకు రూ.5లక్షలు.. 2-5వేల జనాభా ఉంటే రూ.10 లక్షలు.. 5వేల-10 వేల జనాభా ఉంటే రూ.15 లక్షలు.. 10వేలు దాటినట్లయితే రూ.20వేల జనాభా ఉంటే రూ.15 లక్షలు.. 10వేలు దాటితే జనాభా ప్రాతిపదికన రూ.20 లక్షల వరకు ప్రోత్సాహకంగా అందించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించడంతో గ్రామాభివృద్ధి కోసం చాలా గ్రామాలు ఇప్పుడు ఏకగ్రీవాల బాటపడుతున్నాయి.
మొత్తానికి ఎన్నికలు నిర్వహించి కొన్ని స్థానాల్లో అధికార పార్టీని ఇరుకునపెట్టాలని చూస్తున్న నిమ్మగడ్డకు జగన్ సర్కార్ పాశుపతాస్త్రమే బయటకు తీసి చెక్ పెట్టింది. అసలు ఎన్నికలు నిర్వహించకుండానే ఏకగ్రీవాలు చేసేలా ప్లాన్ చేసింది. మరి పంచాయితీ ప్రజలు దీనిపై ఎలా స్పందిస్తారన్నది వేచిచూడాలి..