అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా రోజా పరిస్థితి తయారైంది. రోజా తెలుగులో టాప్ హీరోయిన్ గా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా ఎదిగిన రోజాను బాబు మాత్రం అవసరానికి వాడుకొని పదవుల విషయానికొచ్చేసరికి మాత్రం కరివేపాకులా తీసిరాసేవాడు.
టీడీపీలో ఉన్నప్పుడు రోజాను సొంత పార్టీ నేతలే ఓడించేందుకు ఎన్నో కుట్రలు చేసిన సంగతి తెల్సిందే. దీంతోపాటు ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. ఈక్రమంలోనే రోజా వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి రెండుసార్లు నగరి ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటింది. ఇక కిందటిసారి జగన్మోరెడ్డి సర్కార్ అధికారంలోకి రావడంతో ఆమెకు మంత్రి పదవీ దక్కుతుందని అందరూ భావించారు.
అయితే కుల సమీకరణాల నేపథ్యంలో రోజాకు చివరి నిమిషంలో మంత్రి పదవీ మిస్ అయింది. అయినప్పటికీ ఆమె పేరు మంత్రి పదవీ రేసులోనే ప్రతీసారి విన్పిస్తూనే ఉంటుంది. జగన్ కు సన్నిహితంగా ఉండే రోజాకు ఆయన పలు పదవులు కట్టబెట్టారు. అయితే కొందరు వైసీపీ నేతలే తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని ఆమె పలుమార్లు మీడియా ఎదుట వాపోయింది.
ఇక మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తన నియోజకవర్గంలోని పుత్తూరు.. నగరిలో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే నగరి మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్ రోజాకు వ్యతిరేకంగా రెబల్ అభ్యర్థులను పోటీలో ఉంచారు. ఇక్కడ ఆయనే పట్టుండటంతో ఆమె నిలబెట్టిన అభ్యర్థులు గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడింది.
దీనిని ఎమ్మెల్యే రోజా ముందుగానే ఊహించిందో ఏమోగానీ.. ఉన్నట్టుండి మీడియా ముందుకొచ్చి బోరున విలపించారు. తన నియోజకవర్గంలోనే మున్సిపాలిటీలను కైవసం చేసుకొని మంత్రి పదవీని ఖాయం చేసుకోవాలని అనుకున్న రోజాకు సొంత పార్టీ నేతలే ఆమెకు వ్యతిరేకంగా పావులు కదుపుతుండటం ఆమె కన్నీటికి కారణంగా తెలుస్తోంది. అయితే దీనివెనుక మంత్రి పెద్దిరెడ్డి హస్తం ఉందనే టాక్ విన్పిస్తోంది. పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్న ఎమ్మెల్యే రోజాకు చివరికీ కన్నీళ్లే మిగలడం శోచనీయంగా మారడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.