ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ఎన్నో నాటకీయ పరిణామాలను తలపించాయి. అధికార.. ప్రతిపక్ష పార్టీలు నువ్వా.. నేనా అన్నట్లుగా జోరుగా ప్రచారం చేయడంతో ఓటర్లు ఎవరీ వైపు మొగ్గుచూపుతారా? అనే ఆసక్తి నెలకొంది. రాజకీయ పార్టీల నాయకులు ఎవరికీ వారు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటర్లు కూడా ఈసారి భారీగానే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఏపీలోని 12 కార్పొరేషన్లు.. 71 మున్సిపాలిటీలు.. నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ కాసేపటి క్రితమే ముగిసింది. ఉదయం మందకోడిగా సాగిన పోలింగ్ సాయంత్రం వరకు క్రమంగా పుంజుకుంది. అయితే ఎస్ఈసీ దృష్టిపెట్టిన విజయవాడ.. గుంటూరు.. విశాఖ.. తిరుపతిలో మాత్రం పోలింగ్ శాతం కొంత తక్కువగా నమోదు కావడం గమనార్హం.
కొన్నిచోట్ల రాజకీయ పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగడం మినహా రాష్ట్రమంతటా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. పోలీసులు అలర్ట్ గా ఉండి ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకుండా చూడటంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం వరకు పోలింగ్ శాతం 70శాతానికి చేరుకోగా ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. పోలింగ్ ముగియడంతో ఇక లెక్కింపుపై అందరిపై దృష్టి నెలకొంది.