ఆంధ్రప్రదేశ్ లో పుర, నగర పాలక, నగర పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ తో ఓటర్లు బారులు తీసి ఓట్లు వేస్తున్నారు. మొత్తం ఏపీలోని 2214 డివిజన్, వార్డు స్థానాలకు ఇప్పటికే 580 ఏకగ్రీవం కాగా.. మిగతా వాటికి ఎన్నిక జరుగుతోంది.
ఏలూరు నగర పాలక సంస్థలో ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సోమవారం హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. దీంతో అక్కడ కూడా పోలింగ్ కొనసాగుతోంది.
ఏపీలోని నాలుగు మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా.. మిగిలిన 71 పురపాలికలు, 12 నగర పాలకసంస్థల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 7549 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 77,73,231 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇక పలు చోట్ల ఉద్రికత్తలు ఏర్పడ్డాయి. విజయవాడ పటమట పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన ఓటర్ల స్లిప్పుల్లోని నంబర్లు, పోలింగ్ అధికారుల వద్ద ఉన్న స్లిప్పుల్లోని నంబర్లు తేడా ఉన్నాయని ఓటర్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ఇక కడపలోని ప్రొద్దుటూరులో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి బీజేపీ నేతలు ముక్కుపుడుకలు పంపిణీ చేశారు. వాటిని పంచుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విశాలో ఉక్కు ఉద్యమం ఉన్నా కూడా ఓటర్లు బారులు తీరారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. నక్కవాని పాలెం, తదితర ప్రాంతాల్లో మహిళా ఓటర్లు భారీగా తరలివచ్చి ఓట్లువేస్తున్నారు.
గుంటూరు, కృష్ణ జిల్లాల్లో పోలింగ్ పై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ప్రత్యేకదృష్టి పెట్టారు. కృష్ణా జిల్లాలో పోలింగ్ సరళిని ఆయన పరిశీలిస్తున్నారు. గుంటూరులో ఎస్ఈసీ కార్యదర్శి కన్నబాబు పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరుగనుంది.
Andhra Pradesh: Voting begins for Vijayawada Municipal Corporation elections. pic.twitter.com/ZkQ0XhbDHJ
— ANI (@ANI) March 10, 2021