కరోనా దూకుడు అరివీర భయంకరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 3 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో.. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటు అత్యంత జాగ్రత్తగా ఉండే సెలబ్రిటీలను సైతం కొవిడ్ వదిలిపెట్టట్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే పలువురు ప్రముఖులు కొవిడ్ బారిన పడగా.. తాజాగా మహేష్ బాబు క్వారంటైన్లోకి వెళ్లడం కలకలం రేపుతోంది.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం వరకు షూటింగ్ ను వాయిదా వేసిన మహేష్.. త్రివిక్రమ్ సినిమాను త్వరగా స్టార్ట్ చేసేందుకు సర్కారువారి పాట చిత్రం వేగం పెంచారు.
అయితే.. తాజాగా తన పర్సనల్ స్టైలిష్ట్ కరోనా బారిన పడ్డారని సమాచారం. అతనితోపాటు మరికొందరిలోనూ కొవిడ్ లక్షణాలు కనిపించడంతో సినిమా షూటింగ్ నిలిపేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ముందు జాగ్రత్తలో భాగంగా మహేష్ క్వారంటైన్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో.. ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. పవన్ కూడా క్వారంటైన్లోకి వెళ్లడం.. ఆ తర్వాత కొవిడ్ నిర్ధారణ కావడం తెలిసిందే.
కాగా.. ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షూటింగులు కొనసాగుతున్నాయి. పరిస్థితి తీవ్రం అవుతుండడంతో.. షూటింగులపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సర్కారువారి పాట యూనిట్ మరోసారి దుబాయ్ వెళ్లాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం తొలి షెడ్యూల్ దుబాయ్ లోనే ప్రారంభమైన విషయం తెలిసిందే.