
ఏపీ రాజధాని ఉన్న ప్రాంతం.. రాజకీయాలకు కేంద్రంగా ఉన్న ప్రాంతం కావడంతో గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లలో వాడివేడిగా మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. తాజాగా విజయవాడ కార్పొరేషన్ లో ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోపాటు పలువురు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయవాడలోని పటమటలంక పోలింగ్ బూత్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పడమటలో నివాసం ఉంటున్న పవన్ కు ఎన్నికల అధికారులు ఇక్కడే ఓటు కేటాయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పవన్ ఓటేయడం ఇదే తొలిసారి. ఓటేసేందుకు పడమటలంకలో పోలింగ్ కేంద్రానికి పవన్ వస్తారన్న సమాచారంతో ఆయన అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.
పవన్ రాగానే అక్కడ భారీ ఎత్తున అభిమానులు నినాదాలు చేశారు. కాసేపు హడావుడి సందడి నెలకొంది.
ఇక విజయవాడ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో భారీ ఎత్తున ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు, వికలాంగులు కూడా పోలింగ్ కేంద్రాలకు ఉదయమే తరలివచ్చారు.
విజయవాడ ఏపీ రాజధాని ప్రాంతం కావడంతో ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఏపీ రాజధానిని వైసీపీ ప్రభుత్వం మార్చుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు రెఫరెండంగా మారాయి. ఇరు పార్టీలకు చావోరేవుగా మారిపోయాయి.
విజయవాడలో ఓటువేసిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటమట లంక, జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 4లో పవన్ కళ్యాణ్ గారు ఓటు వేశారు. pic.twitter.com/KQOQNnOE2c
— JanaSena Party (@JanaSenaParty) March 10, 2021