ఏపీలో వైసీపీ సర్కారు వర్సెస్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గా మారిపోయిన పంచాయతీ ఎన్నికల పోరులో తొలిదశ నామినేషన్ల ఘట్టం పూర్తయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చెల్లాచెదురు ఘటనలు మినహా.. నామినేషన్లు ప్రశాంతంగా ముగిశాయి. తొలివిడతలో కొన్నిచోట్ల ఏకగ్రీవాలకు మొగ్గుచూపగా.. మరికొన్ని చోట్ల.. భారీ సంఖ్యలో నామినేషన్లు నమోదయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ రమేశ్ కుమారుతో ముఖాముఖి పోరు జరిపిన వైసీపీ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీల విషయంలో విజయవంతం అయ్యింది. రాష్ర్టవ్యాప్తంగా.. చాలా చోట్ల భారీగా నామినేషన్లు దాఖలు కాగా.. మరికొన్ని చోట్ల నిమ్మగడ్డ ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా.. ఏకగ్రీవాల విషయంలో జగన్ సర్కారు విజయవంతం అయ్యింది.
రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలలో జరిగిన తొలివిడత నామినేషన్ల ప్రక్రియ ముగిసేనాటికి భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు అయినట్లు.. ఎస్ఈసీ విడుదల చేసిన గణంకాలు చెబుతున్నాయి. అన్ని జిల్లాలలో సర్పంచ్ పదవులకు ఈ మూడు రోజుల్లో మొత్తం… 19వేల 491 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అదే విధంగా.. వార్డు మెంబరు పదవులకు మూడు రోజుల్లో… 79,799 నామినేషన్లు దాఖలు చేశారు. అంటే సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు కలిపి మొత్తం లక్ష నామినేషన్లు దాఖలయ్యాయి.
అదే విధంగా తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో.. 93 పంచాయతీల్లో.. సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. చిత్తూరులో 19, తూర్పుగోదావరి 12, గుంటూరు 13, కృష్ణ 10, కర్నూలు 9, నెల్లూరు 6, శ్రీకాకుళం 5, పశ్చిమ గోదావరి5, కడప 5, విశాఖపట్నం 4, ప్రకాశం 1, అనంతపురం 1 ఇలా మొత్తం.. 93 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎస్ఈసీ వివరించారు.
అయితే ఈ పంచాయతీ ఎన్నికల్లో భారీ ఎత్తున ఏకగ్రీవాలు చేయాలని జగన్ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు రూ.5లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఆఫర్లు ప్రకటించింది. అయితే అప్పటికే పంచాయతీ రాజ్ చట్టంలో ఉన్న ఈ నజరానాల గురించి పంచాయతీల్లో ముందుగానే అవగాహన ఉండడం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలతో చాలా చోట్ల పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన చోట అభ్యర్థలు నామినేషన్లకే మొగ్గు చూపారు.
అదే విధంగా సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను బదిలీ చేయాలని ఎస్ఈసీ జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. అఖిల భారత సర్వీసుల అధికారులపై నేరుగా చర్యలు తీసుకునే అధికారం.. ఎస్ఈసీకి లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎస్ ఎస్ఈసీకి లేఖ రాశారు.ప్రవీణ్ ప్రకాశ్ మీద చేసిని ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేస్తూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలనే విషయాన్ని పున:పరిశీలించాలని సీఎస్ కోరారు.