ఆస్పత్రి నుంచి బెడ్ మీద వచ్చి ఊపిరి ఆడక చావుదశలో ఉన్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్యకు ఆనందయ్య కళ్లలో మందు వేయడంతో కోలుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో సంచలనమైంది.
కరోనాకు ఆనందయ్య మందు పనిచేస్తుందని తెలిసి ఆస్పత్రి బెడ్ పై నుంచి కోటయ్య వచ్చాడు. పసరు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయన చాలా ఆరోగ్యంగా కనిపించాడు. ‘ఊపిరి ఆడలేదని.. కొన ఊపిరితో వచ్చానని.. ఇంకో రెండు నిమిషాలు ఆగితే.. ఆక్సిజన్ లేకపోతే చనిపోతాననుకున్నాని.. కంటిలో మందు వేయడంతో 15 నిమిషాల్లో కోలుకున్నానని.. ఈ మందు చాలా అద్భుతం’ అని కోటయ్య వీడియోలో తెలిపారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆనందయ్య మందుపై అందరికీ నమ్మకం పెరిగింది.
అయితే ఆనందయ్య మందు తీసుకున్న తర్వాత కూడా కోటయ్య కరోనా నుంచి కోలుకోలేదని సమాచారం. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వారం క్రితం నెల్లూరు జిజీహెచ్ ఆస్పత్రిలో చేర్పించారు. కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోటయ్య మృతిచెందాడని ప్రధాన మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఆనందయ్య మందుపై దేశవ్యాప్తంగా చర్చజరిగింది. ఆయన మందు తీసుకున్న వారు కోలుకున్నారని తెలియడంతో అందరూ ఎగబడ్డారు. అయితే సదురు హెడ్ మాస్టర్ఇప్పుడు ప్రాణాలు కోల్పోవడంతో మరోసారి చర్చనీయాంశమైంది. ఆయన కరోనాతోనే చనిపోయారా? ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయా? తేలాల్సి ఉంది.
ఎందుకంటే ఆనందయ్య మందును డమ్మీగా నిరూపించేందుకు మెడికల్ మాఫియా, పలు మీడియా చానెల్స్ కుట్ర చేస్తున్నాయని ఆయన స్వయంగా ఆరోపించారు. అల్లోపతి తగ్గించలేనిది .. ఆనందయ్య తగ్గిస్తాడా? అని ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోటయ్య మృతిపై అసలు నిజాలు తెలిసేదాకా ఈ మరణాన్ని ఆనందయ్యకు అంటగట్టడాన్ని ఆపితే మంచిదని పలువురు హితవు పలుకుతున్నారు.