Kota Srinivasa Rao: కోట శ్రీనివాస రావు నేటి మహా నటుడు. వందల సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన నటుడు. ఒక కమెడియన్ గా, విలన్ గా గత నాలుగు దశాబ్దాలుగా తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఆయన నటనకు పలు అవార్డులు కూడా దాసోహం అయ్యాయి. ఇక ఆయన నటనా జీవితంలో ఎన్నో మరపురాని సంఘటనలు, అలాగే మరెన్నో అవమానకర సంఘటనలు కూడా ఉన్నాయి.
కోట గారు ఈ మధ్య వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. అప్పటి జ్ఞాపకాలను, అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంటున్న క్రమంలో కోట తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవి ‘జంబలకిడిపంబ’ సినిమా చేస్తోన్న రోజులు. కేవలం 50 లక్షల రుపాయల బడ్జెట్ తో ఆ సినిమాను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చాలా గొప్పగా తీశారు.
ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళు లాగా, మగవాళ్ళు ఆడవాళ్ళు లాగా మారతారు ఆ సినిమాలో. అయితే, దర్శకుడు ఈవీవీ గారు ఓ రోజు కోట గారిని కూర్చోబెట్టి కథ చెప్పారు. కథ కోట గారికి ఆసక్తిగా అనిపించింది. అయితే, సినిమాలో కోట గారితో పాటు మిగిలిన స్టార్ కమెడియన్స్ కూడా ఓ 15 రోజులు పాటు విశాఖపట్నం వీధుల్లో మంగళసూత్రం మెడలో వేసుకొని తిరగాలి.
కాగా, ఈ విషయం గురించి తెలిసిన ఓ స్టార్ డైరెక్టర్, ‘ఇలాంటి చెత్త చిత్రాలు చేసే కంటే.. వ్యభిచారం చేసి బతకొచ్చు కదా’ అంటూ విమర్శించారు. అది దర్శకుడు ఈవీవీ గారికి తెలిసింది. ఆ విషయాన్ని ఆయన కోట గారితో చెప్పుకుని చాలా బాధపడ్డారట.
ఐతే కోట గారు మాత్రం, ఈవీవీ గారితో ‘ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. మీరు బాధ పడాల్సిన పని లేదని’ దైర్యం చెప్పారట. ఆయన చెప్పినట్లుగానే చివరకు సినిమా రిలీజ్ అయి, అద్భుతమైన విజయాన్ని సాధించింది. సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులంతా షాకయ్యారు.