
Janasena : పరిషత్ ఎన్నికల్లో జనసేన 177 ఎంపీటీసీలను గెలుచుకుంది. 2 జడ్పీటీసీలను కూడా సొంతం చేసుకుంది. ఓవరాల్ గా చూసినప్పుడు ఈ సంఖ్య అల్పమే. కానీ.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పోల్చుకున్నప్పుడు.. జనసేన గత ట్రాక్ రికార్డును పరిశీలించినప్పుడు.. ఇది మెరుగైన ఫలితం అని చెప్పక తప్పదు. ఈ ఫలితాల తర్వాత టీడీపీకి ప్రత్యామ్నాయంగా జనసేన తయారవుతోందా? అనే విశ్లేషణలు కూడా వచ్చాయి. దీంతో.. ఈ రిజల్ట్ జన సైనికులకు కొండంత బలాన్నిచ్చాయి. పవన్ కూడా ఈ ఫలితాలపై సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ స్థాయిలో కూడా సీట్లు వస్తాయని చాలా మంది భావించలేదు. ఊహించిన దానికన్నా ఎక్కువగానే సీట్లు వచ్చిన నేపథ్యంలో.. రెట్టించిన ఉత్సాహంతో ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టేందుకు జనసేనాని సిద్ధమవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై ఇటీవల ఆన్ లైన్ ఉద్యమం నిర్వహించింది జనసేన. మూడు రోజులపాటు దాదాపు 2 కోట్ల మేర ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి.. అందరి దృష్టినీ రోడ్లమీదకు మళ్లేలా చేయగలిగారు. ఈ విషయం ప్రముఖంగా చర్చలోకి రావడం.. చివరకు ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ అంశంపై స్పందించడం గమనించాల్సిన అంశం. అయితే.. అప్పుడే పవన్ ఒక విషయం చెప్పారు. అక్టోబర్ 2 వరకు రోడ్లను బాగు చేయకపోతే.. తానే స్వయంగా రోడ్డెక్కుతానని ప్రకటించారు.
చెప్పినట్టుగానే అక్టోబర్ 2వ తేదీన రోడ్ల బాగుకోసం గాంధీ గిరికి సిద్ధమవుతున్నారు పవన్. ఆ రోజు నుంచి జన సైనికులు స్వచ్ఛందంగా రోడ్లను మరమ్మతులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందుకోసం శ్రమదానం చేసేందుకు సిద్ధమవుతున్నారు. జనసేన కార్యకర్తలతోపాటు అధినేత పవన్ కూడా రెండు రోజులు శ్రమదానం చేయాలని నిర్ణయించుకున్నారు. రోడ్లు దెబ్బతిన్న దాన్ని బట్టి పార్టీ నుంచే మట్టి తోలడం.. గుంతలు పూడ్చడం వంటివి చేయనున్నారు.
ఇలాంటి కార్యక్రమాల ద్వారా జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు జనసేనాని. పరిషత్ ఫలితాలు తెచ్చిన ఉత్సాహంతో.. పార్టీని మరింతగా పటిష్టం చేసుకునేందుకు పలు రకాల కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు పవన్. సుదీర్ఘ కాలం టార్గెట్ పెట్టుకున్న పవన్.. కేవలం అధికారం కోసం, పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదన్న విషయాన్ని ప్రజలు నెమ్మదిగా నమ్ముతున్నారని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి విశ్వాసాన్ని మరింతగా చూరగొనేందుకు ఇలాంటి కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు.