
దేశీయ టెలీకాం దిగ్గజం జియో రాకతో దేశంలోని మొబైల్ ఫోన్ల వినియోగదారులకు అనేక ప్రయోజనాలు కలుగుతున్న సంగతి విదితమే. వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వినియోగదారులకు చేరువయ్యే దిశగా జియో అడుగులు వేస్తోంది. తాజాగా జియో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. టెలీకాం రంగంలో మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది.
ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా నెట్ వర్క్ లకు భారీ షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేసింది. వినియోగదారులు ఇతర నెట్వర్క్ ల నుంచి జియోలోకి మారే పోస్ట్ పెయిడ్ ఖాతాదారులు సెక్యూరిటీ డిపాజిట్ ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదని జియో కీలక ప్రకటన చేసింది. కస్టమర్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో జియో చేసిన ప్రకటన భారీగా కొత్త కస్టమర్లను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. జియో ప్రస్తుతం పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ఉన్న అన్ని సౌకర్యాలను కొత్త కస్టమర్లకు కూడా అందిస్తామని వెల్లడించింది.
రుణ పరిమితి విషయంలో కూడా ఎలాంటి మార్పులు ఉండవని పేర్కొంది. జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ లో చేరే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని వారికి 500 జీబీ డేటాను ఉచితంగా అందజేస్తోంది. సాధారణంగా ప్రీపెయిడ్ కస్టమర్లకు ఆ నెలలో మిగిలిపోయిన డేటాను వినియోగించుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. అయితే పోస్ట్ పెయిడ్ వినియోగదారులు మాత్రం మిగిలిన డేటాను వచ్చే నెలకు బదిలీ చేసుకునే అవకాశం జియో కల్పిస్తోంది.
దేశంలో పోస్ట్ పెయిడ్ ఖాతాదారులకు ఈ విధమైన సౌకర్యాలను కల్పిస్తోంది కేవలం జియో మాత్రమేనని చెప్పాలి. జియో రాకతో అప్పటివరకు ఇతర నెట్ వర్క్ లను వినియోగిస్తున్న ప్రీ పెయిడ్ కస్టమర్లు తమ నెట్ వర్క్ ను జియోకు మార్చుకున్నారు. అదే విధంగా పోస్ట్ పెయిడ్ కస్టమర్లను కూడా ఆకర్షించాలనే ఉద్దేశంతో జియో ఈ నిర్ణయం తీసుకుంది.