తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తుండటం బీజేపీకి బాగా కలిసొస్తుంది. ఈక్రమంలోనే బీజేపీ నేతలు 2023 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో పావులు కదుతుపుతున్నారు. దీనిలో భాగంగానే బీజేపీ నేతలు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంపై ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తోంది.
దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ వైపు ఇతర పార్టీల నాయకులు చూస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ప్రయోగించిన హిందుత్వ నినాదం కొంతమేరకు సక్సెస్ అయినట్లు కన్పించింది. దీంతో భద్రాచలంలోనూ రాములోరి సెంటిమెంట్ రగిలించడానికి బీజేపీ సన్నహాలు చేస్తోంది.
భద్రాచలంలో అభివృద్ధితో ఆలయాల పునరుద్ధరణ చేపడితే తమ అస్త్రం ఫలిస్తుందని బీజేపీ భావిస్తోంది. ఈక్రమంలోనే దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం.. దాని అనుబంధ పర్ణశాల సీతారామచంద్ర స్వామివారి ఆలయాల అభివృద్ధి కోసం కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించేందుకు సిద్ధమవుతోందని సమాచారం.
దీంతోపాటు పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో హడావుడిగా కలుపడంతో రెండు ప్రాంతాల ప్రజలు ఇబ్బదులు పడుతున్నారు. పోలవరం ముంపులేని గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపాలనే డిమాండ్ స్థానికంగా ఉంది. దీంతో బీజేపీ స్థానిక ప్రజల మనసు దోచుకునేలా ఈ సమస్యకు పరిస్కారం చూపేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
తెలంగాణ సర్కారు భద్రాచలం అభివృద్ధిని గాలికొదిలేసిందని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తూనే ఆ పార్టీలోని కీలక నేతలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఖమ్మం జిల్లాలోని టీఆర్ఎస్ లో తుమ్మల నాగేశ్వర్ కు వ్యతిరేకంగా మరోవర్గం పావులు కదుపుతోంది. ఉద్యమకారులను కేసీఆర్ పట్టించుకోవడం లేదని గుర్రుగా ఉన్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీస్తుండటంతో జిల్లా నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ ను బలహీన పర్చేలా చేరికలకు బీజేపీ డోర్లు తెరిచింది. ఇప్పటికే టీఆర్ఎస్ లోని ముఖ్య నేతలతో బీజేపీ సంప్రదింపులు చేస్తున్నారు. త్వరలోనే ఖమ్మం కార్పొరేషన్.. పట్టభ్రదుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు ఖాయమనే టాక్ విన్పిస్తోంది.