YS Jagan Anniversary Vacation: ఈ రాజకీయాల్లో పడి ఏపీ సీఎం జగన్ తన వ్యక్తిగత జీవితానికి పూర్తి దూరంగా ఉండిపోయారు. ఇద్దరు కూతుళ్లు విదేశాల్లో చదువుతుండగా.. భార్య వ్యాపారాల్లో బిజీ ఉంది. జగన్ రాజకీయాల్లో ఎన్నో కష్టనష్టాలు అనుభవించి జైలుకు వెళ్లి, పాదయాత్ర అంటూ మూడేళ్లు ప్రజల్లోకి వెళ్లి నానా కష్టపడి సీఎం అయ్యారు.
గడిచిన పదేళ్లలో జగన్ విదేశీ టూర్లు పోయింది కేవలం మూడునాలుగు సార్లే. ఒకసారి గెలిచాక ఇజ్రాయెల్ లోని జెరూసలెం వెళ్లి క్రీస్తు సేవలో తరించారు. కూతుళ్ల కోసం యూరప్, అమెరికా ఓసారి వెళ్లారు. అయితే ఇప్పుడు మాత్రం ఈ రాజకీయాలు, పాలన పక్కనపెట్టి సెలవు తీసుకున్నారు.
ఏపీ సీఎం జగన్- భారతి దంపతుల 25వ వార్షికోత్సవం నేడు. అందుకోసమే రెండు రోజుల క్రితమే జగన్ సెలవు పెట్టేసి హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా సహా పలు పర్యాటక ప్రాంతాల్లో సేదతీరడానికి కుటుంబసమేతంగా వెళ్లారు. ఐదురోజుల పాటు అక్కడే గడుపనున్నారు. పాలన వ్యవహారాలతో గడిచిన రెండున్నరేళ్లుగా బిజీగా ఉన్న సీఎం జగన్ ఈ 5 రోజులు సిమ్లాలో కుటుంబంతో సేదతీరనున్నాడు.
1996 ఆగస్టు 28న వైఎస్ జగన్-భారతిల వివాహం జరిగింది. జగన్ కు 24వ ఏటనే పెళ్లి చేశాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పులివెందులకు చెందిన ప్రముఖ వైద్యుడు గంగిరెడ్డి కుమార్తెనే భారతి. వీరికి ఇద్దరు కూతుళ్లు. హర్షారెడ్డి, వర్షా రెడ్డి. హర్షా రెడ్డి ప్రస్తుతం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుతున్నారు. చిన్న కుమార్తె వర్షా రెడ్డి ప్యారిస్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చదువుతున్నారు.