వైఎస్ షర్మిల.. ఇన్నాళ్లు వైఎస్ఆర్ కూతురిగా.. అన్న చాటు చెల్లెలిగా మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని నెలకొల్పడమే ధ్యేయంగా పుట్టుకొచ్చిన ఆడపడుచుగా తెలంగాణ వాసులకు పరిచయమైంది. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నట్టు చేసిన ప్రకటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనమైంది. పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
వైఎస్ షర్మిల.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుల తనయ. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం. మంచి వాక్చాతూర్యం ఉన్న యంగ్ లేడీ. మొక్కవోని ధైర్యం.. మొండి పట్టుదల ఆమె సొంతం. గత ఎన్నికలకు ముందు తన స్పీచ్‌లతో ఇతర పార్టీలను గడగడలాడించారు. ఇప్పుడు ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు వైఎస్సార్ రాజకీయ వారసురాలిగా తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నారు. ఆ పార్టీకి ఇప్పటికే పేరు కూడా డిసైండ్ అయిందట. పార్టీ జెండా కూడా రూపుదిద్దుకుందట. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైందని తెలిసింది. త్వరలోనే విధివిధానాలు వెల్లడికానున్నాయని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ అయింది.
ఇప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ.. తెలుగు రాష్ట్రాలు కానీ ఎన్నో ముఖ్యమంత్రులను చూశాయి. ప్రజలు ఎందరి పాలనలో చవిచూశారు. కానీ ఒక్క రాజన్న వైఎస్ఆర్ మాత్రమే ప్రజల గుండెల్లో చిరకాలం గుర్తిండిపోయారు. ఆయన లేకున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఇంకా కొనసాగుతున్నాయంటే ఆ స్వర్ణయుగ పాలనను అర్థం చేసుకోవచ్చు.
అదే వైఎస్ఆర్ బిడ్డ ఇప్పుడు తెలంగాణ బిడ్డగా రాబోతోంది. వైఎస్ షర్మిల మార్చి 1న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పార్టీని ప్రకటించబోతున్నట్టు వార్తలు వెలుబడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె సంప్రదింపులకే వేల మంది వస్తున్న జనం.. ఇక పార్టీకి లక్షల మంది రానున్నారు.
తెలంగాణలో పాత వైఎస్ఆర్ పాలన కోసం ప్రజలు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఇంతలా వైఎస్ షర్మిల పార్టీకి మద్దతు వెల్లువెత్తుతోంది. ఇప్పటిదాకా ఉమ్మడి ఏపీలోనే మహిళా ముఖ్యమంత్రి లేరు. ఇప్పుడు వైఎస్ షర్మిల ఆ లోటును భర్తీ చేసేందుకు వస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ , టీఆర్ఎస్ పాలనలో విసిగివేసారిన ప్రజలకు రాజన్న రాజ్యాన్ని చూపించబోతున్నారు. తెలంగాణలో తొలి మహిళా ముఖ్యమంత్రి కావడమే ఎజెండాగా వస్తున్న షర్మిల ఇప్పుడు లక్ష్య సాధనకు పాదయాత్రను ఎంచుకోబోతున్నట్టు సమాచారం.
ఇప్పటిదాకా పాదయాత్ర చేసి వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్ లు సీఎంలు అయ్యారు. ఇప్పుడు అదే బాటలో షర్మిల నడవబోతోంది. ఈ క్రమంలోనే తొలి తెలంగాణ మహిళా ముఖ్యమంత్రిగా షర్మిల కావడం ఖాయమంటున్నారు. మరి వడివడిగా అడుగులు వేస్తున్న షర్మిల వెంట ఇప్పటికే తాము వస్తామంటూ చాలా కాంగ్రెస్, బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారట.. ఆ తరుణం త్వరలోనే రాబోతోందని అర్థమవుతోంది. అప్పటిదాకా ఎదురుచూడడమే మన కర్తవ్యం.