మన భూమ్మీద ఉన్న సహజ వనరులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయని ఎవరూ చెప్పరు. కానీ వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్న విషయం మరిచిపోవద్దు. ముఖ్యంగా పర్వతాలు, కొండలు లాంటివి భూమి పటిష్టత కోసం ఉపయోగపడుతాయి. కాని అవి రాను రాను కరిగిపోవడంతో నేలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటోంది. ప్రకృతి వైఫరిత్యాల వల్ల కావచ్చు.. మానవులు చేసే తప్పిదాల వల్ల కావచ్చు.. భూమ్మీద ఉన్న సహజ సంపద లేకపోతే జీవన మనుగడ కష్టం కావచ్చు.
ఇటీవల ఉత్తరాఖండ్ లో సంభవించిన మంచు ప్రళయంతో వందలాది ప్రాణాలో భూమిలో కలిసిపోయాయి. ఇంకా కొన్ని మృతదేహాలు లభ్యం కాని పరిస్థితి. అయితే ఈ ఘటనకు పలువురు రాజకీయ నాయకులు ఏవేవో కారణాలు అంటున్నారు. కానీ అసలు కారణం భూతాపం పెరగడమేనంటున్నారు నిపుణులు. అయితే భూ తాపం పెరగడానికి మానవులు చేసే తప్పిదాలు కూడా ఉన్నాయంటున్నారు.
ప్రతీ సంవత్సరం 0.25 మీటర్ల మంచు మాయం అవుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు శిలాజ ఇందనాలు, బొగ్గు వంటి వాడకం విపరీతంగా వాడడం వల్ల వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయంటున్నారు. బొగ్గుగని మండించినప్పుడు వెలువడే కార్బన్ డై యాక్సైడ్ గాలిలో కలిసి ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవుతుందంటున్నారు. అలాగే మితిమీరిన మేథేన్ వాడడంతో భూమ్మీద వేడి విపరీతంగా పెరుగుతందని అంటున్నారు.
భూతాపంపై ఓ జాతీయ సంస్థ ప్రతీ సంవత్సరం లెక్కలు వేస్తోంది. 2014 నుంచి 2018 వరకు గల సంవత్సరాల్లో 2016లో అత్యంత వేడిగా ఉన్న సంవ్సరంగా గుర్తించారు. ఈ అధ్యయనం గత 139 ఏళ్లుగా సాగుతోంది. ఇక అమెరికా శాస్త్రవేత్తలు 1994 నుంచి 2017 సంవత్సరాల మధ్య చేసిన పరిశోధనల్లో భూతాపం కారణంగా 28 ట్రిలియన్ టన్నుల మంచు కరిగిపోయిందని తేల్చారు. 1880 నుంచి పరిగణలోకి తీసుకుంటే ఈ మంచు చరియలు విరిగి నదుల గుండా నీరుగా ప్రవహించడంతో సముద్ర మట్టం పెరుగుతోందంటున్నారు.
ఇక ఉత్తరాఖండ్ లో జరిగిన నష్టానికి కారణాన్ని తెలుసుకునే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. ప్రాథామికంగా తెలిసిన సమాచారం మేరకు మంచుకొండలు కింద ఉన్న నీటి ఒత్తిడి కారణంగా భూమి కంపించిందని, దాని మూలంగా వరదలు పోటెత్తాయని అంటున్నారు. నందా దేవి పర్వతంపై మంచు చెరియలు విరిగి పడడానికి అక్కడి కొండల కింద శతాబ్దాల తరబడి ఉన్న రాతి ఫలకాలు బలహీనపడడమే కారణం కావచ్చని అంటున్నారు.