తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రమంలో పుట్టుకొచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. అదే టీఆర్‌ఎస్. దీనికి బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. ప్రస్తుత తెలంగాణ సీఎం. ఈ ఏడేళ్లలో టీఆర్‌ఎస్ పార్టీ ఎదుర్కోని ఎన్నికలు లేవు. ఎన్నికలంటే ఆ పార్టీకి కొత్త కూడా కాదు. కానీ.. అదేంటో ఈసారి గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు దడ పుట్టిస్తున్నాయి. మంచి చలిలోనూ చెమటలు పట్టిస్తున్నాయి. బీజేపీ దూకుడే ఈ పోటీ వాతావరణాన్ని సృష్టించింది. తన సంప్రదాయ ఓటర్లనే కాకుండా తటస్థ ఓటర్లనూ ఆకట్టుకునేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. విమర్శలతో అధికారపక్షం పోటీలోనే లేదన్నంత హడావిడి చేస్తోంది. ఎంఐఎంను టార్గెట్ చేస్తోంది.
Also Read: తప్పటడుగులు వేస్తున్న బండి సంజయ్
మరోవైపు హిందూ ఓట్లను రాబట్టుకునేందుకు హిందుత్వాన్ని ఎత్తుకుంది. అందుకే.. అటు ఎంఐఎంను.. ఇటు కాంగ్రెస్‌ను కలగలిపి ఒకే కూటమిగా చూపించే ప్రయత్నం చేస్తోంది. కొంతమేరకు ఇది ఫలిస్తున్న సూచనలే కనిపిస్తున్నాయి. ఓటర్లను కన్‌ఫ్యూజ్ చేస్తోంది. అయినా అధికారం ఆమడదూరమే. బలాబలాల్లో మార్పులే తప్ప ఒక్కసారిగా పీఠం చేజిక్కేంతటి మార్పు సాధ్యం కాదనేది ఒక అంచనా.
కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఎన్నికల్లాగే ఈ ఎన్నికల్లోనూ భారీ ఎత్తున దెబ్బ పడే అవకాశాలే కనిపిస్తున్నాయి. ప్రచారంలో ఆ పార్టీ పూర్తిగా వెనకబడింది. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంల హవా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష స్థాయికి తాను చేరుకున్నానని బీజేపీ భావిస్తోంది. హైదరాబాద్ ఎన్నికలతో ఆ విషయాన్ని మరింత స్పష్టం చేయాలని పావులు కదుపుతోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్‌లో అత్యధిక సీట్లు, ఓట్లు సాధించే మొదటి మూడు పార్టీల్లో లేకపోతే చిక్కులు తప్పవు. దాని ప్రభావం తెలంగాణలో హస్తం పార్టీ రాజకీయ భవిష్యత్తుపై తీవ్రంగానే పడుతుంది.
Also Read: గ్రేటర్ లో బీజేపీకి విజయం ఎందుకు అవసరం?
ఇక.. ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వారు, టీడీపీ, వైసీపీ ఓటర్ల ప్రభావం శూన్యం. వైసీపీ ఎప్పుడో చేతులెత్తేసింది. తెలుగుదేశం పార్టీ నామమాత్రంగా పోటీ చేస్తోంది. టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంకు బీజేపీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెటిలర్ల విషయంలో అధికార పార్టీ ఎన్ని హామీలు గుప్పిస్తున్నా టీఆర్ఎస్‌ను పెద్దగా నమ్మేలా లేరు. 2016లో తీవ్రమైన భావోద్వేగాలు నెలకొని ఉన్న స్థితిలో రిస్క్ కు సాహసించని సీమాంధ్ర ప్రాంతం ఓటర్లు టీఆర్ఎస్‌కే జై కొట్టారు. ఓటుకు నోటు దెబ్బతో చంద్రబాబు అధికార నివాసాన్ని విజయవాడకు మార్చుకోవడం, రాజధానిని వదిలి వెళ్లిపోవడంతో అప్పట్లో ప్రత్యామ్నాయం కనిపించని స్థితిలో ఉన్నారు. దీంతో సీమాంధ్ర ప్రాంత ఓటర్లతోపాటు టీఆర్ఎస్ వ్యతిరేకులకూ బీజేపీ ఒక ఆశాజనకమైన శక్తిగా కనిపిస్తోంది.
ఎన్నికలు వచ్చాయంటే ఎత్తుగడలు వేయడం.. తనదైన శైలిలో దూసుకెళ్లడం కేసీఆర్ వంతు. కానీ.. ఈ ఎన్నికల్లో అది లోపించింది. తెలంగాణ సెంటిమెంట్ భావోద్వేగాలను రగిలించలేకపోతున్నారు. ఆంధ్ర ప్రాంతం ఓటర్లు దూరమవుతారనే భావనతో ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఒకటి మాత్రం నిజం.. ఈ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్, ఎంఐఎం కూటమి కడితేనే గ్రేటర్ హైదరాబాద్‌లో అధికార జెండా ఎగురుతుంది. గతంలో మాదిరిగా టీఆర్ఎస్ గ్రేటర్‌లో సెంచరీ కొట్టి ఏకపక్ష విజయం సాధించే వాతావరణం మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్