‘తాడి తన్నేవాడు ఒకడుంటే.. వాడి తలనే తన్నేవారు మరొకరు పుట్టుకొస్తారు’ అని అంటుంటారు. ఇది రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ గెలిచే పార్టీకి.. తమకు పోటీ లేదని.. తమకు తిరుగులేదని విర్రవీగడం సాధారణం. ఒక్క పరాజయం ఎదురయ్యే వరకూ ఆ ధీమా పోదు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను చూస్తే అదే అర్థం అవుతోంది.
Also Read: గ్రేటర్‌లో ‘సోషల్’ వార్
నిన్నామొన్నటి వరకు తెలంగాణ ప్రాంత సెంటిమెంట్‌ను పుట్టించి.. రగిలించి.. పతాక స్థాయికి తీసుకెళ్లి.. తన జీవితంలో అనూహ్యమైన రాజకీయ ఉన్నత స్థానాలను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొందారు. ఇప్పుడు అదే తరహా సెంటిమెంట్‌ను ప్రయోగిస్తూ బీజేపీ శరవేగంగా తెర మీదకు వచ్చింది. కేసీఆర్‌ది ప్రాంతం పాచిక అయితే.. బీజేపీది మతం. కేసీఆర్ వ్యూహాలు ఫలించి ప్రాంతం సెంటిమెంట్ రగిలితే.. ఇప్పుడు ఆయన వ్యూహాలు వికటించి మతం సెంటిమెంట్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా కళ్లు మూసి తెరిచే లోపు గ్రేటర్ ఎన్నికలు ముగించేయాలని టీఆర్‌ఎస్ కలలు కంది. కేవలం 20 రోజుల్లోపే తతంగం అంతా ముగించేయాలని అనుకుంది. కానీ.. ఇప్పుడు ఆ టైం కాస్త సుదీర్ఘంగా అనిపించేలా మారిపోయింది. భారతీయ జనతా పార్టీ నేతలు రోజురోజుకూ వ్యూహాలను మార్చేసుకుంటున్నారు. హైదరాబాద్ ప్రజల్లో నిద్రాణంగా ఉన్న ఓ సెంటిమెంట్‌ను మేల్కొలుపుతున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ దగ్గర్నుంచి కూల్చివేతల వరకూ దేన్ని కూడా వదలడం లేదు. ఫలితంగా ఇప్పుడు.. జై తెలంగాణ నినాదం ఎక్కడా వినిపించడం లేదు. బహిరంగంగా కాకపోయినా చాలా మంది మనసులో జై హిందూ నినాదం వినిపిస్తోంది. దీనికి కారణం బీజేపీ. ఎంఐఎంతో టీఆర్ఎస్ దోస్తీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం.
Also Read: ఇంటెలిజెన్స్ రిపోర్టులో టీఆర్‌ఎస్‌కు షాక్?
జై తెలంగాణ అంటే.. టీఆర్ఎస్ నినాదంలా ఉండేది. తెలంగాణ కోసం టీఆర్ఎస్‌కు మద్దతివ్వాలన్నంతగా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ఉండేది. ఎవరైనా టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై తెలంగాణ వ్యతిరేకుల ముద్ర వేసేవారు. కొన్ని పార్టీల్ని అలాగే తరిమేశారు. ఆయా పార్టీల్లోని నేతలందర్నీ కలిపేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోని నేతల బలహీనతల్ని ఆసరాగా చేసుకుని ఆ పార్టీని కూడా సెంటిమెంట్‌తో దెబ్బకొట్టారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్‌కు మద్దతివ్వాలన్నట్లుగా పరిస్థితి ఉండేది. ఈ నినాదాన్ని.. ఈ ఆచారాన్ని కాస్త బీజేపీ పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ పాతబడిపోయింది. ఇప్పుడు హిందూ సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. ప్రత్యేకమైన ప్రాంతంగా పరిగణించే పాతబస్తీపై గురిపెట్టి పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ప్రారంభించారు.
మజ్లిస్ అంటే పాతబస్తీకే పరిమితమైన పార్టీ. కానీ ఆ పార్టీ ఇప్పుడు.. దేశం మొత్తం విస్తరిస్తోంది. ముస్లింలకు ప్రాతనిధ్యం వహించే పార్టీగా మారిపోయింది. అధికారంలో ఎవరు ఉంటే.. వారి ప్రాపకానికి మజ్లిస్ నేతలు పోటీ పడేవారు. మూసి దాటి బయటకు వచ్చేందుకు సాహసించేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ పార్టీ కశ్మీర్ నుంచి తమిళనాడు వరకు విస్తరించింది. ఇలా ఓ పార్టీ మారిపోయినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా పార్టీలు బలపడతాయి. బీజేపీకి అదే కలసి వస్తోంది. ముస్లింలదంరూ ఏకమైనప్పుడు.. హిందువులు ఎందుకు కాకూడదనే ప్రశ్న మౌలికంగా అందరిలోనూ వచ్చింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్