రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేయడం పార్టీల్లో కనిపిస్తూ ఉంటుంది. ఒక్కో పార్టీలో ఒక్కో నేత కీలకంగా వ్యవహరిస్తుంటారు. ఎంతలా అంటే.. పార్టీ గెలుపును తన భుజస్కంధాలపై వేసుకోవడం.. ప్రత్యర్థిపై విమర్శనాస్త్రాలు సంధించడంలో వారే ధిట్ట. మనమెంత బాగా ప్లాన్ చేసినా.. ప్రత్యర్థి మనకు మించిన ప్లాన్ చేయటం.. వారికి కాలం కలిసి రావటం జరుగుతుంటుంది. ప్రస్తుతం జరుగుతున్న గ్రేటర్ ఎన్నికలను చూస్తుంటే కూడా అదే విషయం తేటతెల్లమవుతోంది.
Also Read: గ్రేటర్‌లో ‘సోషల్’ వార్
ముందు నుంచి గ్రేటర్‌లో గెలుపు నల్లేరు మీద నడకేనని అనుకుంది టీఆర్‌ఎస్ పార్టీ. కానీ.. రానురాను ఆ పోటీ కాస్త టఫ్ అయింది. ఏముంది బీజేపీ? అని లైట్‌గా తీసుకున్న వారంతా.. ఇప్పుడు వామ్మో బీజేపీ అని అనాల్సిన పరిస్థితి వచ్చింది. దుబ్బాకలో ఏ రీతిలో అయితే.. ఎన్నికల ఎజెండాను సెట్ చేశారో.. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని బీజేపీ విజయవంతంగా అమలు చేస్తోంది. అయితే.. ఆ ట్రాప్ లో గులాబీ బాస్ పడిపోవటం చూస్తే.. బీజేపీ వ్యూహకర్తలను మెచ్చుకోవాలని అనిపిస్తోంది. గడిచిన కొద్దిరోజులుగా మోడీని నేరుగా టార్గెట్ చేస్తున్న కేసీఆర్ తీరుపై బీజేపీ అగ్రనాయకత్వం ఉడికిపోతోందని చెబుతున్నారు. దేశంలో మరే ముఖ్యమంత్రి.. విపక్షాలు సైతం మోడీ సర్కారు తీరును విమర్శించే విషయంలో వెనకాడుతుంటే.. అందుకు భిన్నంగా కేసీఆర్ తీరు ఉండటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది.
అందుకే.. బీజేపీ కీలక నేతలంతా కేసీఆర్‌కు మంచి పంచ్ ఇవ్వాలని చూస్తున్నారట. అదే సమయంలో.. తెలంగాణలో తిరుగులేని తన అధికారాన్ని ప్రశ్నించేలా కమలనాథులు బలపడటాన్ని కూడా సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. దుబ్బాక గెలుపును వాపుగా ఫీల్ అయిన కేసీఆర్.. తన అంచనాలు కాస్త తేడా కొట్టినట్లుగా సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. బీజేపీ నేతల ప్రచారానికి ఘాటుగా రియాక్ట్ అయ్యేందుకు శనివారం నాటి సభను వేదికగా వాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధాని మోడీ మీద విరుచుకుపడటంతో పాటు.. విద్వేషాల్ని రెచ్చగొట్టేలా బీజేపీ విష ప్రచారం చేస్తుందన్న మాట ఆయన నోటి నుంచి బలంగా వచ్చే అవకాశం ఉందంటున్నారు.
Also Read: ఇంటెలిజెన్స్ రిపోర్టులో టీఆర్‌ఎస్‌కు షాక్?
మరోవైపు.. కేసీఆర్ వ్యాఖ్యలను బలంగా తిప్పి కొట్టేందుకు బీజేపీ కూడా సంసిద్ధమవుతోంది. శనివారం సాయంత్రం కేసీఆర్ బహిరంగ సభ జరిగితే.. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు వస్తున్నారు. దీంతో కేసీఆర్ మీద ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసేందుకు అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా చూస్తే.. చివరి పంచ్ బీజేపీకే దక్కుతుందన్న మాట వినిపిస్తోంది. కేసీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టేలా వేదికను సిద్ధం చేసుకున్న బీజేపీ.. అమిత్ షా రూపంలో ఆ బాణం విసిరేందుకు రెడీ అయ్యారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్