ఏపీ పంచాయతీ ఎన్నికల్లో తేలిపోయిన బీజేపీ తన మాటల వాడిని మాత్రం ఏమాత్రం తగ్గించడం లేదు. కనీసం జనసేన అన్ని సీట్లు కూడా గెలుపొందలేక చతికిలపడిన పార్టీ ఏకంగా 151 ఎమ్మెల్యే సీట్లు సాధించి తిరుగులేకుండా ఉన్న వైసీపీని చిత్తుగా ఓడిస్తుందట..
ప్రస్తుతం బలాబలాలు చూస్తే ఏపీలో వైసీపీని, జగన్ కు కొట్టడం అంత ఈజీకాదు.. గండరగండరడు లాంటి చంద్రబాబు వల్లే ఇది కావడం లేదు. అంత వృద్ధాప్యంలోనూ పోరాడుతున్నారు. మరో ఐదేళ్లు దాటితే చంద్రబాబుకు వయసు మీద పడి అస్సలు యాక్టివ్ పాలిటిక్స్ చేస్తాడో లేదో కూడా తెలియదు. ఇక టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తండ్రి వారసత్వాన్ని అందుకోలేక ఆపసోపాలు పడుతున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరితోనే కాని పని బీజేపీతో అవుతుందట..
తాజాగా కడప నగరంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హాట్ కామెంట్స్ చేశారు. కడప మున్సిపాలిటీలో పర్యటించిన వీర్రాజు వైసీపీ ప్రభుత్వానికి చెక్ పెట్టే ఏకైక పార్టీ బీజేపీ అని సవాల్ చేశారు. అధికారులు అంతా వైసీపీకి వత్తాసు పలుకుతున్నారని.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు పోలీసులు బెదిరిస్తున్నారని విమర్శించారు. కేంద్రం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలన్నింటిని జగన్ పేరుతో ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.
అయితే వైసీపిని కొట్టడం బీజేపీ వల్ల కాదన్న చర్చ ఏపీ రాజకీయవర్గాల నుంచి వినిపిస్తోంది. జనసేనతోనైనా అవుతుంది కానీ బీజేపీని నమ్మే పరిస్థితి లేదంటున్నారు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సహా చాలా ఏపీ వ్యతిరేక నిర్ణయాలను బీజేపీ తీసుకుందని.. అందుకే ఆ పార్టీని ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటున్నారు.మరి ఏపీ బీజేపీ అధ్యక్షుడి నమ్మకం ఎంత మేరకు ఫలిస్తుందో వేచిచూడాలి.