
ఇంగ్లండ్ తో జరగబోయే టీ20 సిరీస్ కు ఐపీఎల్ హీరోలకు టీమిండియా అవకాశం కల్పించింది. ఎన్నాళ్లుగానో అవకాశం కోసం ఎదురుచూస్తున్న వీరికి అనూహ్యంగా టీమిండియాలో అవకాశం దక్కింది. వీరి రాకతో టీ20లో చోటు ఉన్న ముగ్గురి కెరీర్ ప్రమాదంలో పడింది. ఎందుకంటే వారు వరుసగా విఫలమవుతుండడం.. దూసుకొచ్చిన వీరు రాణిస్తే వారికి చెక్ పడడం ఖాయంగా కనిపిస్తోంది.
గత కొన్ని సీజన్ల నుంచి ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరుఫున పరుగుల సునామీ సృష్టిస్తున్న సూర్యకుమార్ యాదవ్ తోపాటు రాజస్థాన్ ఆల్ రౌండర్ రాహుల్ తెవాటియా, ముంబై ఇండియన్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ లకు టీమిండియా టీ20ల్లో అవకాశం కల్పించింది.
సూర్యకుమార్ యాదవ్ గత ఐపీఎల్ 2020లో ముంబై తరుఫున ఏకంగా 480 పరుగులు చేసి ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా సిరీస్ కు ఎంపిక కావాల్సి ఉన్నా అతడిని ఎంపిక చేయకపోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఇంగ్లండ్ తో అతడికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కనుక టీమిండియాతో సిరీస్ లో రాణిస్తే సూర్యకుమార్ కు ఇక తిరుగుండదు.
ఇక ఇషాన్ కిషన్ అటు రంజీ, ఇటు విజయ్ హాజరే ట్రోఫీ, ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శనలతో టీమిండియా తలుపు తట్టాడు. వరుస సెంచరీలతో అతడు కెరీర్ ను నిలబెట్టుకున్నాడు.
ఇక ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరుఫున రాహుల్ తెవాటియా అద్భుతంగా రాణిస్తున్నాడు. గత సీజన్ లో జట్టు పలు మ్యాచ్ లు గెలవడంతో కీలక పాత్ర పోషించాడు.
ఈ ముగ్గురి వల్ల ఇప్పటికే టీమిండియా తరుఫున టీట్వంటీల్లో ఉండి రాణించలేకపోతున్న కుల్దీప్ యాదవ్, మనీష్ పాండే, సంజూ శాంసన్ లపై వేటు పడింది. వారు రాణిస్తే వీరి కెరీర్ ప్రశ్నార్థకంగా మారనుంది.