తెలంగాణ ఇప్పుడు దేశానికే అన్నపూర్ణ అయ్యింది. ఏకంగా ధాన్యం దిగుబడుల్లో రికార్డులు నెలకొల్పుతోంది. కాళేశ్వరం, పాలమూరు-ఎత్తిపోతల పథకాలతో తెలంగాణ వ్యాప్తంగా సాగునీరు లభ్యత పెరిగి.. నీటి ఊట పైకి వచ్చి భూముల్లో పంటలు బాగా పండుతున్నాయి. దీంతో సహజంగానే భూముల విలువ ఎన్నో రెట్లు పెరిగింది. ఇక కేసీఆర్ సర్కార్ ఇచ్చే రైతు బంధుతో అసలు భూములు అమ్మేవారు లేకుండా పోయారు. అమ్మినా కోట్లు పోయాల్సిందే..
తెలంగాణ రాష్ట్రంలో భూములకు విలువ పెరగడంతో ఇప్పుడు సర్కార్ ఆ భూముల విలువను గరిష్టంగా 50శాతం పెంచాలని రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే సాగుభూములు గరిష్ట, కనిష్ట విలువల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. భూముల మార్కెట్ విలువ పెంపుతోపాటు, రిజిస్ట్రేషన్ తత్సంబంధిత 20 రకాల సేవలపై విధించే చార్జీలను పెంచనున్నారు.
ఎనిమిదేళ్లుగా తెలంగాణలో భూముల విలువను సవరించలేదు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) తలసరి ఆదాయం రెట్టింపయ్యాయి. నూతన ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు అభివృద్ధి చెందింది. సాగునీటి వసతి విస్తరించడంతో భూముల విలువ భారీగా పెరిగింది. వివిధ రంగాల్లో అభివృద్ధి నేపథ్యంలో భూముల మార్కెట్ విలువలు సవరించాలని నిర్ణయించారు.
తాజాగా లెక్కల ప్రకారం తెలంగాణలో వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తుల విలువ గరిష్టంగా 50శాతం పెరగనుంది. ప్రాంతాల వారీగా విలువ ఆధారంగా అవి 20శాతం, 30శాతం, 40శాతం మేర పెరుగనున్నాయి.
దాదాపు తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్ల తర్వాత భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో ప్రస్తుతం కనుక ఈ పెంపుపై గ్రీన్ సిగ్నల్ ఇష్తే.. ఈ రాత్రి నుంచే సవరించిన పెంచిన ధరలు అమల్లోకి వచ్చే అవకాశముంది. భూములు, ఆస్తుల విలువ పెంపునకు సంబంధించిన సాఫ్ట్ వేర్ ను కూడా అధికారులు సిద్ధం చేశారు.
ప్రస్తుతం భూములు, ఇళ్లు, ప్లాట్ల క్రయవిక్రయాలపై ప్రస్తుతం స్టాంప్ డ్యూటీ 4శాతం ఉండగా.. ట్రాన్స్ ఫర్ డ్యూటీ 1.5శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5శాతం మొత్తం కలిపి 6శాతం రిజిస్ట్రేషన్ చార్జీలను చెల్లిస్తున్నారు. ఇకపై ఇవి భారీగా పెరగనున్నాయి.