
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటల యుద్ధం ప్రారంభించారు. ఇన్నాళ్లు జవసత్వాలు లేని పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు నూతనోత్తేజం వచ్చింది. దీంతో పలువురు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని రేవంత్ రెడ్డి వెల్లడించారు పలు పార్టీలకు చెందిన నేతలు తనతో టచ్ లో ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ లో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయని చెప్పారు. ఎవరికి కావాల్సిన విధంగా వారు వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు ఎల్. రమణను సీఎం కేసీఆర్ రాజకీయ ప్రయోజనాలకోసమే పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. తన కూతురు కవిత జగిత్యాల సీటు కోసం రమణను బలిపశువును చేశారని ఎద్దేవా చేశారు. ఇవాళ ముగ్గురు నేతలు తనను కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతామని చెప్పారన్నారు. ఇప్పటికే పలువురు నేతలు తనను సంప్రదించి పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తెలిపారు. కానీ సమయం కోసం వేచి చూడాలని చూస్తున్నామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోదరుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ ముదిరాజ్, భూపాలపల్లికి చెందిన టీడీపీ మాజీ నేత గండ్ర సత్యనారాయణ ఉన్నట్లు వెల్లడించారు. మూడు వర్గాలకు చెందిన నేతలు పార్టీలోకి వస్తామని చెబుతున్నారని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాకూర్ కు రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. కౌశిక్ రెడ్డి పిల్లవాడు అని అతనితో సీఎం కేసీఆర్ మాట్లాడిస్తున్నారని పేర్కొన్నారు. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించమన్నారు. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్న సంగతి నాకు ముందే తెలుసన్నారు. దీంతో హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే విషయం అప్పుడే వెల్లడించమని వివరించారు.