
ఎట్టకేలకే ఏపీపీఎస్సీ నిద్ర మత్తు నుంచి మేల్కొంది. ఇన్నాళ్లు నిరుద్యోగుల శాపనార్థాలు భరిస్తూ వచ్చింది. ఉద్యోగాలు కల్పిస్తామని జగన్ సీఎం కాకముందు ఇచ్చిన వాగ్గానాన్ని నిలబెట్టుకునే క్రమంలో తాజాగా నోటిఫికేషన్ జారీకి సంకల్పించింది. 1200 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సంసిద్ధమైంది. పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభమైంది. త్వరలోనే దీనిపై సమగ్రంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు పూనుకోవడంతో నిరుద్యోగుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగాలు సాధించాలని నిరుద్యోగులు ప్రయత్నాలు ప్రారంభించారు. తమ కలలు సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇన్నాళ్లు వేచి చూసిన వారి బతుకులు మారే అవకాశం వచ్చింది. దీంతో ప్రభుత్వ తీరుతో హర్షం వ్యక్తం అవుతోంది.
గ్రూప్ -1, గ్రూప్ -2 సహా 1200 కు పైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం ఆగస్టులో నోటిఫికేషన్లు జారీ చేస్తామని ఏపీపీఎస్సీ సభ్యుడు సలాంబాబు మీడియాతో చెప్పారు. ప్రస్తుతం ఏపీపీఎస్సీ వద్ద 1180 వరకు ఖాళీ పోస్టుల వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా గ్రూప్ -1, గ్రూప్ -2 కేటగిరీల్లో మరిన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది.
2018లో జారీచేసిన నోటిఫికేషన్లకు సంబంధించి రిజర్వేషన్ల కేటగిరీల్లో అర్హులైన అభ్యర్థులు లేక దాదాపు 364 పోస్టులు భర్తీ కాలేదు. ఈ పోస్టులతో కలుపుకుని ఇతర ఖాళీల భర్తీకి వీలుగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. దీనిపై అన్ని వివరాలు తెప్పించుకున్నామని పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆశలు నెరవేరేందుకు ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టారు.