రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ఓ గుంతలో పడిపోయాం. ముక్కూ, మూతి పగిలింది. నెక్స్ట్ టైమ్ ఏం చేస్తాం? ఆ దారిలో వెళ్తున్నప్పుడు అల్లంత దూరం ఉండగానే.. జాగ్రత్త పడతాం. ఆ గుంతను తప్పించుకొని సురక్షితంగా వెళ్లిపోతాం. అలా చేయకుండా మళ్లీ పాత పద్ధతిలోనే వెళ్తే ఏమవుతుంది? మళ్లీ మళ్లీ అదేవిధంగా పడిపోతే ఏం జరుగుతుంది? ప్రతిసారీ ముక్కూ, మూతి పగలదు. తలకూడా పగలొచ్చు. పైకి కూడా వెళ్లిపోవచ్చు.
కరోనా విషయంలో ఇదే జరుగుతోంది. ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించినంత కాలం బలవంతంగా ఇళ్లలో ఉంటున్న జనం.. బయటకు వచ్చిన తర్వాత విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారు. కనీస బాధ్యత లేకుండా.. కరోనా నిబంధనలు పాటించకుండా.. మాస్కులు వేసుకోకుండా.. భౌతిక దూరం పాటించకుండా.. తిరుగుతున్నారు. దీంతో.. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ ఘంటికల నేపథ్యంలో.. కేసులు పెరిగిపోతుండడం ఆందోళనకు దారితీస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి మళ్లీ అదుపు తప్పుతోందా? అనే సందేహం కలిగేలా కేసులు పెరుగుతున్నాయి. విజయవాడ జీజీహెచ్ లో రోజుకు సగటున 20 నుంచి 25 మంది వరకు కొత్త కేసులు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో 170 మంది వరకు చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు. అటు విశాఖ కేజీహెచ్ లోనూ పరిస్థితి ఇదేవిధంగా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం.. 50 మంది ఇన్ పేషెంట్లు ఉన్నారని, రోజూ వచ్చేవారు.. డిశ్చార్జ్ అయ్యేవారు సమానంగా ఉంటున్నారని చెబుతున్నారు. గుంటూరు, కాకినాడ జీజీహెచ్ లోనూ ఇదే పరిస్థితి నెలకొందని అక్కడి సూపరింటెండెంట్లు చెబుతున్నారు.
వీరిలో చాలా మంది ఆక్సీజన్ సమస్యతోనే బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఊపిరి సరిగా అందకపోవడంతో.. దాదాపు అందరికీ ఆక్సీజన్ అందించాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇంకా.. ఆసుపత్రులకు రాకుండా ఇళ్ల వద్దే ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి సంఖ్య మూడునాలుగు రెట్లు అధికంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అందించిన సమాచారం ప్రకారం.. 25 వేల మందికి పైగా కొవిడ్ చికిత్స తీసుకుంటున్నారని, అయితే.. 20 వేల మంది ఇళ్ల వద్దనే మందులు వాడుతున్నారట.
ఈ పరిస్థితికి జనాల నిర్లక్ష్యమే పూర్తిగా కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైరస్ తీవ్రత తగ్గిందని తెలియగానే.. మాస్కులు తీసి అవతల విసిరేస్తున్నారని అంటున్నారు. భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వాడడం వంటివి అసలు చేయట్లేదని అంటున్నారు. దీంతో.. వైరస్ తేలిగ్గా అందరికీ పాకుతోందని చెబుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని ఎంతగా హెచ్చరిస్తున్నా.. జనాలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే.. ఎవరు మాత్రం ఏం చేస్తారని నిట్టూరుస్తున్నారు.