
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కాలంలో వరుస శుభవార్తలు చెబుతోంది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో అదిరిపోయే ఆఫర్లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. కరోనా, లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రయోజనం చేకూర్చే దిశగా ఎస్బీఐ అడుగులు వేస్తోంది. తాజాగా ఎస్బీఐ కస్టమర్ల కోసం మరో అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది.
సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని పర్సనల్ లోన్, కార్ లోన్, గోల్డ్ లోన్ లకు అతి తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తోంది. ఉద్యోగులు, వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎస్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల భారీగా ప్రయోజనం చేకూరనుందనే చెప్పవచ్చు. ఎస్బీఐ మరోవైపు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును కూడా తగ్గించడం గమనార్హం. ఎస్బీఐ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాలను వెల్లడించింది.
ఎవరైతే ఎస్బీఐ యోనో యాప్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటారో వాళ్లు ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. గోల్డ్ లోన్ కు 7.5 శాతం నుంచి వడ్డీరేటు ప్రారంభమవుతుందని.. రుణం తీసుకున్న రోజు నుంచి మూడు సంవత్సరాల్లో రుణం తిరిగి చెల్లించాల్సి ఉంటుందని చెబుతోంది. కారు లోన్ కు వడ్డీ రేటు 7.5 శాతంగా ఉండగా పర్సనల్ లోన్ కు 9.6 శాతం వడ్డీ రేటుగా ఉంది.
అయితే అందరికీ ఈ ఆఫర్ అందుబాటులో ఉండదని.. ఎంపిక చేసిన కస్టమర్లు మాత్రమే ఈ ఆఫర్ కు అర్హులని ఎస్బీఐ చెబుతోంది. ఈ ఆఫర్ పొందాలంటే యోనో యాప్ ను ఖచ్చితంగా వినియోగిస్తూ ఉండాలి. 567676 నెంబర్‌కు PAPL ఐ టైప్ చేసి పంపితే ఈ ఆఫర్ కు అర్హులో కాదో తెలుసుకోవచ్చు.