భారతీయ సినీ లోకంలో కొందరికి మాత్రమే అన్ని విషయాల్లో అతీతమైన స్టార్ డమ్ ఉంటుంది. సినిమాలు చేసినా చేయకపోయినా ఆ విలువ అలాగే కొనసాగుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తుల్లో అమితాబ్ బచ్చన్ ఒకరు. అది సర్కార్ సినిమా చేస్తోన్న రోజులు. తెలుగు నటులను కూడా ఈ సినిమాలో పెట్టుకోవాలనే ఆలోచన వచ్చింది వర్మకు.
వెంటనే కోట శ్రీనివాసరావు, నటుడు జీవాకు ఫోన్ చేసి పిలిపించాడు. తెలుగు నటులుగా బాంబేలో ‘సర్కార్’ సెట్‌లోకి అడుగు పెట్టారు కోట, జీవా. అక్కడంతా తొలి రోజు సందడిగానే గడిచిపోయింది. రాత్రికి వర్మ వీళ్ల దగ్గరకు వచ్చి మీ పాత్ర ఒక సౌత్ ఇండియన్ పొలిటీషియన్ బాంబేలో సెటిలవుతాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. కోట మాత్రం ఏదో ఆలోచనలో పడిపోయాడు.
ఎందుకంటే రేపు నటించబోయేది ది గ్రేట్ అమితాబ్ తో. అందుకే, ఆ రాత్రి అంతా కోట నిద్రపోలేదు. భయంభయంగా ఏదో ఆలోచిస్తూనే ఉన్నారు. అమితాబ్ అంటే మామూలు వ్యక్తా ? ఎంతో పరిణితి చెందిన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తితో కలిసి పోటీగా నటించాలి అంటే.. కచ్చితంగా భయపడే విషయమే. కోట ఆ టెన్షన్ తోనే సెట్ లోకి అడుగు పెట్టాడు.
అమితాబ్ కోటను చూడగానే ఎదురొచ్చి పలకరిస్తూ ఆప్యాయంగా భుజం మీద చెయ్యేసి ‘హా.. కోటాజీ. నమస్తే. ఆప్ కైసాయేజీ’ అంటూ సరదాగా నవ్వుతూ మాటలు కలిపారు. నిజానికి అంతకు ముందెప్పుడూ కోట, అమితాబ్ ను కనీసం డైరెక్ట్ గా కూడా చూడలేదు. కానీ మొదటి కలయికలోనే అమితాబ్ పాజిటివ్ స్పందన చూసి.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎందుకు అమితాబ్ ని బిగ్ బీ అని గౌరవిస్తుందో అర్ధమైంది.
ఆ గౌరవానికి అమితాబ్ పూర్తీ అర్హుడు అని కోట తన మనసులో అనుకున్నాడు. డిసిప్లిన్, సిన్సియారిటీకి ప్రాణమిస్తారు అమితాబ్. షూటింగ్ లో ఉన్నప్పుడు కూడా అమితాబ్ పద్ధతులు, వ్యవహారం కోట, జీవాలకు ఎంతో గొప్పగా అనిపించాయి. ముఖ్యంగా సహ నటులను గౌరవించడం అమితాబ్ సంస్కారానికి నిదర్శనం.