CSK vs MI : ఐపీఎల్ సెకండ్ ఫేజ్ అద్భుతంగా మొదలైంది. ముంబై ఇండియన్స్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో ఘనమైన విజయం సాధించింది చెన్నై. ఆల్మోస్ట్ ఓటమి ఖాయమైన ఈ జట్టు.. తనదైన పోరాట పటిమతో గెలుపు జెండా ఎగరేసింది. అదే సమయంలో.. గెలుపు తమదేనని భావించిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) సొంత తప్పిదాలతో ఓటమిని కొని తెచ్చుకుంది. మరి, ఆ పొరపాట్లు ఏంటీ? అన్నది చూద్దాం.
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై(Chennai Super kings) తీరు చూసి ఈ జట్టు కనీసం వంద పరుగులైనా చేస్తుందా? అని సందేహించారు ఆడియన్స్. 1/1, 2/2, 7/3… మూడు ఓవర్లు ముగిసే నాటికి ఇదీ చెన్నై స్కోరు. మొయిన్ అలీ, డుప్లెసిస్ సున్నాలు చుట్టేయగా.. అంబటి రాయుడు కూడా రిటైర్డ్ హర్ట్ గా సున్నా పరుగులకే పెవిలియన్ చేరాడు. ధోనీ (MS Dhoni), రైనా (Suresh Raina) కూడా సింగిల్ డిజిట్ తోనే బ్యాట్ సంకన పెట్టుకొని వెళ్లిపోయారు. దీంతో.. 24 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మిగిలిన వారిలో ఒకరిద్దరు మినహా.. స్పెషలిస్టులు లేకపోవడంతో స్కోరు బోర్డు సెంచరీ దాటడం కూడా కష్టమేనని అందరూ అనుకున్నారు.
కానీ.. తనదైన ఆటతీరుతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు రుతురాజ్. కేవలం 58 బంతుల్లో 88* పరుగులతో దంచికొట్టాడు. చివర్లో కేవలం 8 బంతుల్లోనే బ్రావో 23 పరుగులు సాధించడంతో చెన్నై జట్టు ఏకంగా 156 పరుగులు సాధించింది. చెన్నై జట్టు ఇంతగా మిరాకిల్ చేసినప్పటికీ.. ముంబైకి ఇదేం పెద్ద స్కోరు కాదు. కానీ.. సౌరబ్ తివారీ (50) మినహా.. బ్యాట్స్ మెన్ ఎవ్వరూ నిలబడలేదు. బ్రావో 3, దీపక్ చహర్ 2 వికెట్లతో ముంబైని చావుదెబ్బతీశారు. ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు మాత్రమే సాధించి ఓటమిని మూటగట్టుకుంది ముంబై.
అయితే.. ఈ మ్యాచ్ లో ప్రత్యర్థుల ఆటతీరుతోపాటు సొంత తప్పిదాలు కూడా ముంబై కొంప ముంచాయి. చెన్నైని 88 పరుగులతో నిలబెట్టిన రుతురాజ్ 9వ ఓవర్లో కీపర్ కు సింపుల్ క్యాచ్ ఇచ్చాడు. కానీ.. డికాక్ అందుకోలేకపోయాడు. అప్పుడు రుతురాజ్ స్కోరు 19 పరుగులే. ఈ లైఫ్ ను వాడుకున్న రుతురాజ్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.
మరో తప్పిదం ముంబై బౌలర్లది. తొలి 10 ఓవర్లకు చెన్నై స్కోరు కేవలం 44 పరుగులు. కానీ.. మిగిలిన 10 ఓవర్లలో ఏకంగా 112 పరుగులు సమర్పించుకున్నారు. స్లాగ్ ఓవర్లలో అందరూ తేలిపోయారు. వికెట్లు తీయకున్నా.. పరుగులను కట్టడి చేసి ఉండాల్సింది. ఇవి రెండూ చేయలేకపోవడంతో.. చెన్నై చక్కగా తేరుకుంది.
మూడో తప్పిదం కెప్టెన్ పొలార్డ్ వికెట్ పారేసుకోవడం. పొలార్డ్ ఔట్ అయ్యే సమయానికి 42 బంతుల్లో 70 పరుగులు చేయాలి. ముంబైకి ఇదేం పెద్ద సమస్య కాదు. కానీ.. హజెల్ వుడ్ బౌలింగ్ లో తడబడ్డ పొలార్డ్ ఎల్బీ అయ్యాడు. దీంతో.. ముంబై ఆశలు వదులుకుంది. ఓపెనర్లు సహా.. టాప్ ఆర్డర్ కూడా కుప్పకూలడం ముంబైకి మైనస్ అయ్యింది.