అక్కినేని మాటల మనిషి కాదు, చేతల మనిషి. అందుకే ఆయన అదృష్టాన్ని ఎప్పుడు నమ్ముకోలేదు. శ్రమనే పెట్టుబడిగా పెట్టి, తనదైన కోణంలో తెలుగు వెండితెరపై వెలిగిపోయిన రొమాంటిక్ హీరో ఆయన. కానీ, నాగేశ్వరరావు ఏఎన్నార్ గా మారడానికి చాలా కృషి చేశారు. మద్రాసు మహానగరంలో అడుగుపెట్టిన రోజున ఆయనకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు.
కానీ, ఆ తర్వాత ఏఎన్నార్ గొప్ప మాటలను రాసే స్థాయికి ఎదిగారు. పెద్దగా చదువుకొని ఏఎన్నార్ ‘అ..ఆ లు అక్కినేని ఆలోచనలు’ అనే మంచి పుస్తకాన్ని రాయగలిగారు అంటే.. అది అక్కినేనికే సాధ్యం అయింది. అక్కినేని ఆలోచనా విధానం ఎలా ఉంటుందో చెప్పడానికి ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటనను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
అది 1948వ సంవత్సరం అనుకుంటా… ఆ రోజుల్లో ఏఎన్నార్ గారు చెన్నై తేనాంపేటలో అద్దె గదిలో ఉండేవారు. ఆయనకు ఆ సమయంలో బాగా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజు తన లాల్చీ-పైజామాను మధ్యాహ్నం పూట భోజనం మానుకొని మరీ ఇస్త్రీ చేయించుకున్నారు. ఇస్త్రీ చేసిన ఆ దుస్తులు ధరించి, వేషం అడగడం కోసం ఫిల్మ్ కంపెనీకి సైకిల్ మీద బయలుదేరారు.
అయితే, ఆయన్ని క్రాస్ చేసిన కారు వేగం వల్ల, బురద నీరు చిమ్మి ఆయన దుస్తులు పాడయ్యాయి. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకొనే ఏఎన్నార్ గారు తన జీవితంలో ఎప్పుడూ కారుని వేగంగా నడపలేదు. అలాగే నడపనిచ్చే వారు కూడా కాదు అట. ఆయన ప్రతి చిన్న విషయాన్ని అంత లోతుగా ఆలోచించేవారు. ఆయనలో ఉన్న మరో అంశం.. చేసిన తప్పును మళ్ళీ చేయరు.
అందుకే.. తన జీవితం నుంచి నేర్చుకున్న కొన్ని జీవిత అనుభవాలను గొప్ప పాఠాలుగా మలుచుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, దాదా సాహెబ్ ఫాల్కే లాంటి అరుదైన పురస్కారాలు దక్కినా ఆయన ఎన్నడూ పొంగిపోలేదు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సాధారణ మనిషిలానే ఆయన నిత్యం నేర్చుకుంటూ చివరి క్షణం వరకు అలాగే గడిపారు.
అక్కినేని తన పుస్తకంలో రాస్తూ.. ‘అనుభవం మీద నేను నేర్చుకున్నది ఏమంటే నాకు ఎదురైన ప్రతి కీడూ కూడా మేలుగా పరిణమించిందని. జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా, తరచు ప్రయత్నించే చీమలా అపజయాన్ని అంగీకరించకూడదనేదే నా మతం. సదరు అపజయాన్ని సవాలు చేస్తూ మనిషి తిరిగి.. తిరిగి ప్రయత్నం చేయాలి’ ఇది అక్కినేని మాట కాదు, జీవితాంతం ఆయన పాటించిన విజయం సూక్తి. కాగా నేడు ఆయన జయంతి సందర్భంగా యావత్తు ఆయన అభిమాన లోకంతో పాటు మనం ఆయనను స్మరించుకుందాం.