భారత్ తో సమయం వస్తే చాలు సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వే పాకిస్తాన్ తాజాగా 2003 నాటి భారత్ తో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని కఠినంగా అమలు చేస్తున్నట్టు ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. వారం రోజులుగా భారత్ తో సరిహద్దున గల గ్రామాలన్నీ తుపాకీ మోతలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నాయి. కాల్పుల విరమణను పాకిస్తాన్ దళాలు కఠినంగా అమలు చేస్తూ అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి.
ప్రతిసారి పాకిస్తాన్ సైన్యమే ఉగ్రవాదులను భారత్ లోకి పంపించేందుకు కాల్పులు జరుపుతూ సరిహద్దుల్లో నిత్యకృత్యంగా బాంబుల మోత ఉండేది. కానీ ఉగ్రవాదానికి ఆవాసంగా మారిన పాకిస్తాన్ కు నిధులను ఆపేస్తున్నట్టు ఇటీవల అంతర్జాతీయ ఆర్థిక చర్యల కార్యాచరణా దళం (ఎఫ్ఏటీఎఫ్) ప్రకటించింది. ఈ పరిణామంతో అంతర్జాతీయంగా పాకిస్తాన్ రూపాయి అప్పు పుట్టదు. ఉగ్రవాదాన్ని అరికడితేనే పాకిస్తాన్ కు రుణం లభిస్తుంది. భారత ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఈ ప్రయత్నాలతోనే అంతర్జాతీయంగా పాకిస్తాన్ కు ఈ గతి పట్టిందన్న వాదన ఉంది.
దీంతో ఇప్పటికే కరోనా కల్లోలంతో పీకల్లోతు అప్పుల్లో మునిగిన పాకిస్తాన్ తప్పనిసరి పరిస్థితుల్లో ఉగ్రవాదులను అదుపు చేసి.. సైన్యాన్ని కంట్రోల్ చేసి అరికట్టే చర్యలు చేపట్టింది. భారత్ తో కాల్పుల విరమణను తెరపైకి తెచ్చింది.
ఇక మోడీ కూడా పాక్ తో కాల్పుల విరమణకు ఓకే చెప్పాడు. జమ్మూకశ్మీర్ లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కొనసాగించడానికి ఈ కాల్పుల విరమణ అత్యవసరం కావడంతో భారత్ కూడా దీనికి ఓకే చెప్పింది.
అయితే చైనానుంచి పాకిస్తాన్ మీదుగా వెళ్లే సీపెక్ ప్రాజెక్టు కోసమే పాకిస్తాన్ విరమణ ప్రకటించిందని.. భారత్ సరిహద్దుల్లో గుండా వెళుతున్న ఈ ప్రాజెక్టు పూర్తికే ఇలా చేసిందన్న అనుమానాలు కలుగుతున్నాయి.