ఈ మధ్య కాలంలో యువతలో చాలామంది పొగ తాగే అలవాటుకు బానిసలవుతున్నారు. వేర్వేరు కారణాల వల్ల చాలామంది పొగ తాగడాన్ని అలవాటు చేసుకుంటున్నారు. సిగరెట్లు ఎక్కువగా తాగితే ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెజబ్బులు, ఇతర వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నా ఈ అలవాటును మాత్రం మానలేకపోతున్నారు. ఎక్కువ సిగరెట్లు తాగితే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం ఉంటుంది.
అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, అలవాట్లను మార్చుకోవడం ద్వారా సులభంగా సిగరెట్ ను మానేయవచ్చు. సిగరెట్ మానేయాలని అనుకునేవాళ్లు దృష్టి సిగరెట్ వైపు పడకుండా నిగ్రహించుకోవాలి. మొదట కష్టంగా అనిపించినా ఆ తరువాత సిగరెట్ వైపు ఆలోచనలు మళ్లవు. పొగ తాగాలని అనిపిస్తే ఆ సమయంలో చిప్స్, పచ్చళ్లు, ఎండు ఫలాలను తింటే పొగ తాగాలనే కోరిక తగ్గుతుంది.
సిగరెట్ తాగకూడదని తీసుకున్న నిర్ణయాన్ని మన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చెప్పాలి. అలా చెప్పడం వల్ల సిగరెట్ తాగాలని అనిపించినా అవతలి వ్యక్తులకు భయపడి సిగరెట్ కు దూరమయ్యే అవకాశం ఉంటుంది. నికోటిన్ ప్రత్యామ్నాయంగా ఉండే ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా సులభంగా సిగరెట్ ను మానేయవచ్చు. అల్లం, కరక్కాయలను బాగా నలగ్గొట్టి అందులో నిమ్మకాయ రసం వేసి ఆ మిశ్రమాన్ని తీసుకుంటే సిగరెట్ తాగాలనే కోరికను తగ్గించుకోవచ్చు.
సిగరెట్ మానేయాలని నిర్ణయం తీసుకున్న తరువాత తాగాలని అనిపిస్తే ప్రశాంతంగా కూర్చుని దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కూడా సులభంగా సమస్యకు చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజూ 2 గ్లాసుల వేడి నీళ్లలో నిమ్మరసం పిండుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది.