
దేశంలో సంవత్సరం సంవత్సరానికి మద్యం తాగే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. మద్యపానం ఆరోగ్యానికి హానికరమనే సంగతి తెలిసినా చాలామంది ఈ అలవాటును మానుకోవడానికి అస్సలు ఇష్టపడరు. పలు అధ్యయనాల్లో మద్యం సేవించడం వల్ల ప్రాణాలకు అపాయం ఏర్పడుతుందని తేలిన సంగతి తెలిసిందే. అయితే కొంచెం మొత్తంలో మద్యం తాగితే మంచిదని చాలామంది భావిస్తారు.
తాజా ఆధ్యయనాల ప్రకారం మద్యం కొంచెం మొత్తం తీసుకున్న ప్రమాదమేనని వెల్లడైంది. తీసుకునే పరిమాణంతో సంబంధం లేకుండా మద్యం మెదడుపై ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనంలో తేలింది. 25000 మందిపై పరిశోధనలు జరిపి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. సీనియర్ క్లినికల్ పరిశోధకులు అన్య టోపివలా మద్యం తీసుకునే వాళ్లను మతిమరపు సమస్య వేధించే అవకాశం ఉందని చెప్పారు.
మోతాదుతో సంబంధం లేకుండా ఎంత మొత్తం మద్యం తీసుకున్నా ఈ సమస్య తప్పదని ఆయన చెప్పుకొచ్చారు. వైన్, స్పిరిట్, బీర్ ఏది తీసుకున్నా శరీరంపై ఆ ప్రభావం పడుతుందని వెల్లడించారు. మద్యం ఎక్కువగా తీసుకునే వాళ్లు బీపీ, ఒబేసిటీ లాంటి ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మద్యం తీసుకునే వాళ్లు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
కొంచెం మొత్తం మద్యం తీసుకున్నా భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడక తప్పదు. ఇష్టానుసారం మద్యం సేవిస్తే మాత్రం ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది.