
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు కేసు వ్యవహరంలో సుప్రీం కోర్టుకు జగన్ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో చాలా ఆసక్తికర విషయాలను పొందుపరిచి అందుకు సంబంధించిన నివేదికను సమర్పించింది. గత నాలుగు రోజుల కిందట ఎంపీ అరెస్టు చేసి జైలుకు తరలించే క్రమంలో ఆయనను ఆసుపత్రిలో చికిత్స చేయించేందుకు ఆయన తరుపున న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టు ఆదేశాలు పట్టించుకోలేదనే సుప్రీం కోర్టులో మరో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఈరోజు అందుకు సంబంధించి కౌంటర్ ఫైళ్లను సమర్పించింది.
ఇందులో పలు ఆసక్తి విషయాలను పేర్కొంది. ఎంపీని కేవలం ప్రభుత్వంపై విమర్శలు చేయడంతోనే అరెస్టు చేయలేదని, అందుకు పెద్ద హిస్టరీ ఉందని తెలిపింది. ఎంపీగానే కాకుండా సామాన్యుడికి ప్రభుత్వాన్ని ప్రశ్నించేహక్కు ఉందని, అయితే ఎంపీ మాత్రం రెండు వర్గాల మధ్య చీలికలు సృష్టించారన్నారు. చాలా కాలంగా ఎంపీ కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని, ఎంపీగా తన హోదాను మరిచిపోయిన ప్రభుత్వాన్ని అస్తిరపర్చే కుట్ర చేశాడని పేర్కొన్నారు.
ఎంపీపై రాజద్రోహం కేసు పెట్టారని అంటున్నారు.. అయితే ఆ కేసు పెట్టడానికి అనేక కారణాలున్నాయని పేర్కొన్నారు. రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టే యత్నం ఎంపీ చేశారని, వాటి కొనసాగింపుగా రక్తపాతం జరిగే అవకాశం ఉందని, అయితే అలాంటి ఫిర్యాదులు రాకముందే ప్రభుత్వం అప్రమత్తమైందన్నారు. ఇక ప్రభుత్వంపై కొవిడ్ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే కేసు పెట్టారన్న వాదనలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు.
ఇక ఎంపీని ఆసుపత్రికి తరలించే క్రమంలో తన కాళ్లను పైకి లేపి చూపించడం వెనుక ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్రలో భాగమేనన్నారు. పోలీసుల కస్టడిలో ఉన్న రఘురామను కొట్టాడని చెప్పడం అబద్ధమని, ఆయన అరెస్టును ఒక భయంకర వాతావరణం సృష్టించడానికే ఇలా చెప్పారని కౌంటర్లో పేర్కొంది. ఇక జ్యూడిషియల్ కస్టడిలో ఉన్న ఎంపీ మీడియాతో మాట్లాడాడాని ప్రయత్నించాడని ప్రభుత్వం సుప్రీంకు సమర్పించిన ఫైళ్లలో పేర్కొంది. ఇక రఘురామ బెయిల్ పై శుక్రవారం హియరింగ్ జరగనుంది. అంటే మరి కొద్ది గంటల్లోనే ఆయన బెయిల్ పై తీర్పు చెప్పనుంది.