టీడీపీ అధినేత చంద్రబాబు జోష్ మీదున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల సొంతూళ్లలో కూడా టీడీపీ మద్దతుదారులు సర్పంచ్ లుగా గెలవడంతో బాబులో ఎక్కడలేని ఆనందం తన్నుకొచ్చింది. ఫైర్ బ్రాండ్ కొడాలి నాని సొంతూళ్లో టీడీపీ గెలవడం ఆ మంత్రి పరువు తీసింది. ఈ క్రమంలోనే చంద్రబాబు బయటకొచ్చి తన సంతోషాన్ని పంచుకున్నారు.
అమరావతిలో మీడియా ముందుకొచ్చిన చంద్రబాబు.. మొదటి రెండు దశల్లో జరిగిన ఓట్ల శాతాన్ని చూస్తే వైసీపీ పతనం ప్రారంభమైనట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 39శాతానికి పైగా స్థానాల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థులే గెలిచారని.. రాష్ట్ర ప్రజలంతా టీడీపీ వైపే ఉన్నారని.. వైసీపీ ఎంపీలు, మంత్రులకు కంచుకోటగా చెప్పుకునే స్థానాల్లోనూ టీడీపీ సత్తా చాటిందని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.
దీన్ని బట్టి రాబోయే సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎంపీలు, మంత్రులకు వారి సొంత గ్రామాల్లోనూ మద్దతు లేకుండా పోతోందని చంద్రబాబు అన్నారు. ప్రజలు వైసీపీ నేతలను నిలదీశారని.. ఓడించారని.. వారి అరాచకాల వల్ల ప్రజలు నిలదీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చంద్రబాబు అన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో 82శాతం పోలింగ్ కావడం అధికార పార్టీ పతనానికి నాంది అని చంద్రబాబు అన్నారు. నా జీవితంలో తొలి సారి పంచాయతీ ఎన్నికల్లో ఇంతటి భారీ పోలింగ్ జరగడం అధికార పార్టీపై వ్యతిరేకతతోనే జరిగిందని చంద్రబాబు అన్నారు.
ఇక వైసీపీ నేతలతో సహకరించి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తప్పవని చంద్రబాబు ఘీంకరించారు. తాము అధికారంలోకి వచ్చాక అందరిపై చర్యలు తీసుకుంటామని బాబు గారు హెచ్చరించారు.
మొత్తంగా చంద్రబాబులో పంచాయతీ ఎన్నికల జోష్ వచ్చేసింది. భారీగా పోలింగ్ జరగడం.. మంత్రులు, ఎమ్మెల్యేల సొంతూళ్లలో కూడా టీడీపీ గెలవడంతో బాబులో కూసింత సంతోషం వెల్లివిరిసింది.