మున్సిపల్ ఎన్నికల్లో అమరావతి పరిధిలో వైసీపీకే ప్రజలు పట్టం కట్టడంతో ఇక అమరావతి సెంటిమెంట్ లేదని నిర్ధారించుకొని ప్రభుత్వం కొరఢా ఝలిపించింది. అమరావతి పేరిట కొన్ని ఏళ్లుగా అక్కడి రైతులతో కలిసి ఉద్యమిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు తాజాగా పంచాయతీ, మున్సిపల్ఎన్నికల్లో ఆప్రాంత వాసులే షాకిచ్చారు. అమరావతి పరిధిలోని గుంటూరు, విజయవాడల్లో వైసీపీనే గెలిపించారు. దీంతో ఇక చంద్రబాబు ఎంత మాత్రం ఉపేక్షించవద్దని డిసైడ్ అయిన జగన్ సర్కార్ తాజాగా అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరిట జరిగిన అక్రమాలపై చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే చంద్రబాబుకు నోటీసులు ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
రాజధాని భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. చంద్రబాబు అనుయాయులు లబ్ధి పొందారన్న ఆరోపణలతో ఈ నోటీసులు అందజేసినట్లు తెలిసింది. ఇందులో సీఎంగా చంద్రబాబు పాత్ర ఉందని.. విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న ఏపీ సీఐడీ అధికారులు, నోటీసులు అందజేశారు. మొత్తం ఆరుగురు అధికారులు చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడి లోపలికి వెళ్లి నోటీసులు అందజేశారు. 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో కోరినట్లు తెలిపారు.
సీఎం కాకముందు జగన్ ను ఎన్నో కేసుల్లో ఇరికించి ముప్పు తిప్పలు పెట్టిన ప్రత్యర్థులను జగన్ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు జగన్ వేటాడడం మొదలుపెట్టాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబుకు సైతం జగన్ సర్కార్ అదే ట్రీట్ మెంట్ ఇవ్వడంతో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. దీనిపై హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.