కొద్దిరోజులుగా తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇక ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ బలపడుతున్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. ఈక్రమంలో బీజేపీ అధిష్టానం సైతం తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెడుతోంది.
బీజేపీ అధిష్టానం ఎప్పటికప్పుడు స్థానిక నేతలతో టచ్లో ఉంటూ వ్యూహాలు.. ప్రతివ్యూహాలు రచిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్న కమలదళం టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను తనవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతోంది.
టీఆర్ఎస్ పార్టీకి రైతుల నుంచి ఫుల్ మద్దతు ఉంది. దీనికితోడు దేశవ్యాప్తంగా రైతులంతా నిరసనలు చేపడుతున్నారు. దీంతో బీజేపీ నేతలు రైతులను పక్కనపెట్టి మిగతా వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.
తెలంగాణలోని నిరుద్యోగ యువత.. పట్టభద్రులు.. ప్రభుత్వ.. ప్రైవేట్ ఉద్యోగులు.. యువ ఓటర్లతోపాటు మహిళలపై బీజేపీ ఫోకస్ పెడుతోంది. ఈ మేరకు ఆయా వర్గాలతోనే సర్కారుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్.. స్కాలర్‌షిప్స్.. వడ్డీలేని రుణాలు.. ఆసరా పింఛన్లు..టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆయావర్గాలకు దగ్గరయ్యేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.ఇప్పటికే దీనిపై బీజేపీ శ్రేణులను రాష్ట్ర నాయకత్వం అప్రమత్తం చేసినట్లు సమాచారం.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిత్యం ఆందోళనలు.. నిరసన ర్యాలీలు.. ధర్నాలను అన్ని జిల్లాలో చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో టీఆర్ఎస్ బలహీనంగా ఉన్నచోట్ల బీజేపీ పుంజుకునేలా వ్యూహాలను రచిస్తోంది. మరోవైపు రాబోయే పట్టభ్రదుల ఎమ్మెల్సీ.. కార్పొరేషన్ ఎన్నికలపై కూడా బీజేపీ ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తోంది.