ఏమో గుర్రం ఎగురావచ్చు.. బీజేపీ గెలవనూ వచ్చు అంటున్నారు ఎగ్జిట్ పోల్స్ చేసిన ప్రముఖులు.. ఒక ఎగ్జిట్ పోల్ లో టీఆర్ఎస్ గెలుస్తుందని వచ్చింది. ఇంకోదాంట్లో బీజేపీ గెలుస్తుందని తేలింది.. కానీ జనాభిప్రాయాన్ని దగ్గరగా చూసే న్యూస్ చానెల్స్, పత్రికా విలేకరులను పలకరిస్తే బీజేపీ గెలిచేస్తుందని చెబుతున్నారు. దీంతో తెలంగాణలో అతిపెద్ద సంచలనం ఖాయమా అన్న చర్చ జరుగుతోంది. అధికార టీఆర్ఎస్ ను ఓడించి బీజేపీ గెలువబోతోందా అన్న ఊహే అందరిలోనూ ఎగ్జైటింగ్ కలిగిస్తోంది. దానికి కారణాలున్నాయి..
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
గండరగండరలు లాంటి వారినే ఓడించిన చరిత్ర టీఆర్ఎస్ ది. పైగా ట్రబుల్ షూటర్ హరీష్ రావు కనుక స్కెచ్ గీస్తే అక్కడ విజయం గ్యారెంటీ.. తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి లాంటి ఘటికులను ఓడించిన చరిత్ర హరీష్ రావు. హరీష్ కాలు పెట్టాడంటే అక్కడ గెలుపు గ్యారెంటీ అంటారు. అలాంటి హరీష్ రావు ప్రాణం పెట్టిన చోట బీజేపీ గెలుస్తే ఏమైనా ఉంటుందా? అదే జరగబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంతా అనుకున్నట్టుగా దుబ్బాక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 82శాతం పోలింగ్ నమోదైంది. దీన్ని బట్టి జనాలు ఓట్లు వేయడానికి పోటెత్తారనే అర్థమవుతోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రజలు నిబంధనలు పాటిస్తూ ఇంత భారీగా పోలింగ్ చేయడంతో పార్టీలో ఒకింత ఆనందం.. మరోపక్క తమ కొంప ముంచుతుందా అన్న భయం నెలకొంది.
Also Read: దుబ్బాక ఎగ్జిట్ పోల్: ఎవరిది గెలుపంటే?
పోలింగ్ మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. కొన్ని అధికార టీఆర్ఎస్ గెలుస్తుందని ఫలితాలు ప్రకటించగా.. మరికొన్ని ప్రతిపక్ష బీజేపీ గెలుస్తుందని తెలిపాయి.
తెలంగాణలో అధికారంలో ఉండడంతో టీఆర్ఎస్ తన ప్రత్యర్థి బీజేపీని ఆర్థికంగా చాలా దెబ్బతీసింది. రఘునందన్ బావ మరిది వద్ద కోటిరూపాయలు పట్టుకుంది. రఘునందన్ రావు బంధువుల ఇళ్లలోనూ లక్షల రూపాయలను సీజ్ చేసింది. దీంతో కేంద్రంలోని అమిత్ షా, కిషన్ రెడ్డిలు కల్పించుకొని తమిళనాడు నుంచి ఐపీఎస్ ను తెచ్చి ఇక్కడ ఎన్నికల పరిశీలకుడిగా నియమించాల్సి వచ్చింది. అయితే ఎంత అడ్డుకున్నా దుబ్బాకలో మోహరించిన బీజేపీ శ్రేణులు మాత్రం బాగానే కష్టపడ్డారు. మొత్తం బీజేపీ శ్రేణులను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దుబ్బాకలో మోహరించారు. తను అధ్యక్షుడు అయ్యాక జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని సర్వశక్తులు ఒడ్డారు.
ఇక అధికార టీఆర్ఎస్ కు ట్రబుల్ షూటర్ హరీష్ రావు అతనొక్కడే అందరిలోనూ అన్నట్టుగా వ్యవహరించారు. హరీష్ కాలు పెడితే అక్కడ విజయం సుసాధ్యం అన్న అంచనాలతో కేసీఆర్, కేటీఆర్ కూడా అటు వైపు తొంగిచూడలేదు. ప్రెస్ మీట్లు, సభలకే పరిమితం అయ్యారు. హరీష్ రావు కూడా సుడిగాలిలా పర్యటించి తన ఎత్తులు, జిత్తులతో టీఆర్ఎస్ గెలుపు కోసం కష్టపడ్డారు.
ఈ క్రమంలోనే దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో ‘పబ్లిక్ పల్స్ సర్వే ఏజెన్సీ’ తమ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఇది వరకు చాలా ఎన్నికల ఫలితాలను ఖచ్చితత్వంతో వెల్లడించిన పబ్లిక్ పల్స్ సంస్థ తాజాగా దుబ్బాకలోనూ ఓట్లేసిన ప్రజల అభిప్రాయాలను క్రోడీకరించి సర్వే ఫలితాలను వెల్లడించింది. దుబ్బాక లో బీజేపీ గెలుస్తుందని ‘పబ్లిక్ పల్స్ సర్వే ఏజెన్సీ’ స్పష్టం చేసింది. బీజేపీకి దుబ్బాకలో 45.2శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఇక అధికార టీఆర్ఎస్ కు 42.5శాతం ఓట్లు మాత్రమే వస్తాయని వివరించింది. ముచ్చటగా మూడో స్తానంలో కాంగ్రెస్ పార్టీ 11.7శాతం ఓట్లు సాధించి వెనుకబడుతుందని తెలిపింది. ఇక ఇతరులకు 0.6శాతం ఓట్లు వస్తాయని వివరించింది. టీఆర్ఎస్ పై బీజేపీ 4000-6000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని పబ్లిక్ పల్స్ ప్రజల నాడిని పసిగట్టి చెప్పుకొచ్చింది. మండలాల వారీగా పబ్లిక్ పల్స్ మెజార్టీ ఓట్లు ఎవరికి వస్తాయన్నది ఖచ్చితత్వంతో సర్వే చేసింది. దుబ్బాక, చేగుంట, నర్సంగి, మిడిదొడ్డి మండలాల్లో బీజేపీ మెజారిటీ సాధిస్తుందని తెలిపింది. ఇక ఒకే ఒక తొగుట మండలంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధిస్తుందని తెలిపింది.రాయపోలు, దౌల్తాబాద్ మండలాల్లో టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు వస్తాయని వివరించింది.
Also Read: సీఎం జగన్ కరోనా కంటే డేంజర్.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..?
పబ్లిక్ పల్స్ మాత్రమే కాదు.. అక్కడ ప్రజలు, యువకులు, నాయకులు, మీడియాల్లో కూడా బీజేపీ వైపే మొగ్గు కనిపిస్తోందన్న చర్చ సాగుతోంది. అదే జరిగితే తెలంగాణలో అతిపెద్ద సంచలనం ఖాయం. తెలంగాణలో అధికారంలో టీఆర్ఎస్ కు ఘోర అవమానం ఎదురవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ట్రబుల్ షూటర్ హరీష్ రావు టేకప్ చేసిన ఏ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఓడిపోలేదు. ఇక్కడ ఓడిపోతే అంతకంటే అవమానం మరొకటి ఉండదు. ప్రజలు కూడా ఎంత కోపంగా.. ఆవేశంగా టీఆర్ఎస్ పై ఉన్నారన్నది దీన్ని బట్టి తేటతెల్లమవుతుంది. ఇక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై కూడా వరుసగా ఓడిపోయాడన్న సానుభూతి ఉంది. పైగా ఆయన మల్లన్నసాగర్ బాధితుల పక్షాన సొంత ఖర్చులు పెట్టుకొని హైకోర్టులో పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే మల్లన్నసాగర్ భూనిర్వాసితులు, రైతులంతా రఘునందన్ కే ఓట్లు గంపగుత్తగా గుద్దారన్న ప్రచారం సాగుతోంది. మరి అదే నిజమైతే అధికార బలంతో ఇన్నాళ్లు క్లీన్ స్వీప్ లు చేసిన టీఆర్ఎస్ కు తెలంగాణలో భంగపాటు తప్పదు. కాని అధికారపక్షం టీఆర్ఎస్ గెలుపు పక్కా అనే వారు కూడా కూడా లేకపోలేదు. మరి బీజేపీ పై చేయి సాధిస్తుందా లేదా అన్నది చూడాలి.
ఇక దుబ్బాకలో కనుక బీజేపీ విజయం సాధిస్తే రాబోయే 2024 ఎన్నికల్లోనూ ఆపార్టీదే విజయం అన్న ధీమా కమలనాథుల్లో వ్యక్తమవుతుంది. ఒకవేళ బీజేపీ ఓడిపోయినా తెలంగాణలో రెండవస్థానంతో పాటు టీఆర్ఎస్ కి మేమే సాటి పోటీ అనే ఉత్సాహం ఆ పార్టీకి మరింత బలాన్నిస్తుంది. గులాబీ దళం గుండెల్లో గుబులు పుడుతుంది. మరి దుబ్బాకలో ఏం జరుగుతుంది? ఎవరిది విజయం అన్నది నవంబర్ 10న తేలనుంది. అప్పటివరకు ఉత్కంఠగా ఎదురుచూడాల్సిందే.