తమిళనాడులో గత కొన్నాళ్లుగా రజనీకాంత్ రాజకీయ ఎంట్రీపై జోరుగా చర్చ నడుస్తోంది. ఎన్నికల వస్తున్నాయంటే చాలు రజనీ గురించే చర్చ నడిచేది. దేవుడి శాసిస్తే రాజకీయాల్లో వస్తానంటూ సినిమా డైలాగులు చెప్పి రజనీ దాటేసేవాడు. అయితే ఇటీవల రజనీకాంత్ తాను రాజకీయాల్లో వచ్చి ప్రజా సేవ చేస్తానని ప్రటించాడు.
సీఎం పదవీపై తనకు ఆశలేదని చెప్పిన రజనీ.. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన ఉంటుందని ప్రకటించాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. అయితే ఉన్నట్టుండి రజనీకాంత్ అనారోగ్యానికి గురవడంతో అందరిలోనూ టెన్షన్ నెలకొంది.
రెండ్రోజులు ఆస్పత్రిలో ఉండి డిశ్చార్జ్ అయిన తను రాజకీయాల్లోకి రావడంలేదని.. అభిమానులు తనను క్షమించాలంటూ ఇటీవల ప్రకటించాడు. దీంతో ఆయన అభిమానులంతా నిరుత్సాహానికి గురవడంతోపాటు అయోమయానికి లోనవుతున్నారు.
అయితే రజనీ రాజకీయాల్లోకి రాకుండానే వెనుకడుగు వేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులు మాత్రం రజనీ రాజకీయాల్లోకి రావాలని కోరుతుండగా.. కొందరు మాత్రం రజనీ రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రజనీకాంత్ రాజకీయాల్లో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంపై సీనియర్ దర్శకుడు భారతీరాజా స్పందించారు. రజినీకాంత్ ప్రకటన సముచితమని.. అలాంటి నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదంటూ భారతీరాజా హ్యాట్సాఫ్ చెప్పారు.
రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ విషయంలో గతంలో భారతీరాజా విభేధించారు. ‘సినిమాలకు భాష.. ప్రాంతం అవసరం లేదని.. కానీ రాజకీయానికి ప్రాంతీయత అవసరం’ అని రజనీ రాజకీయ ప్రవేశంపై వ్యతిరేకతను వ్యక్తం చేశాడు.
రజనీకాంత్ కు దేవుడు ఆధ్యాత్మికతను.. కీర్తి ప్రతిష్టలను ఇప్పటికే ఇచ్చారని మళ్లీ రాజకీయాలు అవసరం లేదన్నాడు. తానున్న హెల్త్ కండిషన్ కు ఆయన పాలిటిక్స్‌కు రాకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని భారతీరాజా వ్యక్తం చేశాడు.