ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరాక ఆలయాలపై దాడులు పెరిగిపోయాయన్నది అందరూ కాదనలేని వాస్తవం. వరుసగా ఏపీలోని ఆలయాలపై దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా శతాబ్ధాల చరిత్ర కలిగిన విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలోని బోధికొండపై ఉన్న కోదండరాముడి విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేయడం ఏపీలో మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది.
ఈ క్రమంలోనే నాస్తికవాది అని ఇన్నాళ్లు చెప్పుకొని ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక హిందుత్వావాణి వినిపిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా ఈ ఆలయ విగ్రహ ధ్వంసాన్ని లేవనెత్తారు. ఈ విగ్రహ ధ్వంసాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు.
స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విధానం.. శిరస్సు కనిపించకుండా పోవడం చూస్తే బాధ కలుగుతోందని పవన్ అన్నారు. ఏపీలో ఏడాదిన్నరగా దేవతా విగ్రహాలు, ఆలయ రథాలు ధ్వంసం చేస్తున్నారని.. తాజాగా రామతీర్థం విగ్రహం ధ్వంసం చేయడం.. శిరస్సు భాగాన్ని ఎత్తుకెళ్లడం దారుణం అని మండపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ దుర్మార్గపు చర్యలు రాష్ట్రంలో సాగుతున్నాయని.. హిందూ ఆలయాలపై దాడులు పెరిగిపోతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని పవన్ ప్రశ్నించారు. సీఎం జగన్ కు ఏ మత విశ్వాసం ఉన్నా పరమతాలను గౌరవించాలని పవన్ హితవు పలికారు.
ఈ క్రమంలోనే ఏపీలో ఏడాదిన్నరగా దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించి కేంద్ర హోంశాఖ దృష్టి సారించాలని.. సీబీఐతో దర్యాప్తు చేయించాలని పవన్ డిమాండ్ చేశారు.