తొలి టెస్టులో పేకమేడలా కూలి చరిత్రలోనే అత్యల్ప స్కోరుకు ఔట్ అయ్యి ఘోర ఓటమిని మూటగట్టుకున్న టీమిండియా రెండో టెస్టులో మాత్రం సత్తా చాటింది. ఏకంగా ఆస్ట్రేలియాపై సమయోచితంగా ఆడి పట్టుబిగించింది. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే 112, రవీంద్రజడేజా 57 పరుగుల భాగస్వామ్యంతో టీమిండియా నిలబడింది. తొలి ఇన్నింగ్స్ లో 326 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాపై 131 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
ఈరోజు ఉదయం 277/5 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ఆరంభించిన భారత్ తొలి సెషన్ లో మరో 49 పరుగులు జోడించి చివరి 5 వికెట్లు కోల్పోయింది. తొలుత జట్టు స్కోరు 294 పరుగుల వద్ద రహానె రనౌట్ కావడంతో వికెట్ల వేట మొదలైంది. మరో ఆరు ఓవర్లకే జడేజా సైతం పెవిలియన్ కు చేరాడు. దీంతో భారత్ 306 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది.
ఇక బౌలర్లు అశ్విన్ (14), ఉమేశ్ 9 పరుగులతో కాసేపు అడ్డుకున్నారు. ఆ తర్వాత భారత ఇన్నింగ్స్ కు 326 పరుగుల వద్ద తెరపడింది.
ఇక భారత్ ఆలౌట్ అయ్యాక బ్యాంటింగ్ దిగిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు ఆటాడుకుంటున్నారు. ఇప్పటికే ఉమేష్ తొలి వికెట్ ను తీశాడు. వేడ్, లంబూషేన్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 22/1 స్కోరుతో క్రీజులో కొనసాగుతోంది.