
ఏపీలో ప్రస్తుతం నెలకొంటున్న రాజకీయ పరిస్థితులతో పోలీసులు అప్రమత్తం అవుతున్నారు. రోజుకో కొత్త అంశం వివాదంగా మారుతుండడంతో నిఘాను పెంచుతున్నారు. ఇప్పటికే ఆలయాలు, విగ్రహాల కూల్చివేత కేసులు ఏపీ ప్రభుత్వంతోపాటు పోలీసులను ఇరుకున పడేయగా.. ఇదంతా ప్రతిపక్ష టీడీపీ కుట్రగా పోలీసులు తేల్చారు. ఈ మేరకు పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసులు సైతం నమోదు చేశారు. ఈ విషయమై డీజీపీ సవాంగ్ పలు రాజకీయ పార్టీలు.. నాయకులతో సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా పోలీసుల అధికారులతో సమీక్షించారు. మతాలు, కులాల విషయంలో చిచ్చు పట్టాలని చూసేవారిపై కఠినంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ఈ మేరకు పోలీసులు కూడా జిల్లాల వారీగా తమ పరిధిలో మతపరమైన కేసులను సున్నితంగా పరిశీలిస్తున్నారు. ఎవరైనా ఇలాంటి విధ్వేషాలకు పాల్పడుతున్నారా..? అని నిఘా పెంచుతున్నారు.
ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. షెడ్యూల్ ప్రకారం.. ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పండగ సందడి నెలకొంది. ఆయా ప్రధాన పార్టీలకు అనువుగా ఉన్న లోకల్ లీడర్లలో ఎంపిక చేసిన వారిని పోటీలో నిలిపేందుకు సిద్ధం అవుతున్నాయి. అయితే పల్లెల్లో ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికల వ్యవహారంలో మత, కుల పరమైన విధ్వేశాలకు కొన్ని పార్టీలు కుట్రపన్నే అవకాశం ఉందని అందిన సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తం అవుతున్నారు. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు .. ఇప్పడు మరో ఎత్తంటూ.. వివాదాస్పద వ్యక్తులకు వార్నింగ్ ఇస్తున్నారు. కుల, మతాలకు అతీతంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరుతున్నారు. అనవసరపు కక్షపూరిత గొడవలకు పోవద్దని.. జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం 13 జిల్లాల్లో దేవాలయాల భద్రతపై ఈవోలు, దేవాలయాల ఉన్నతాధికారులతో ఏపీ డీజీపీ గౌతవ్ సవాంగ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఈ రోజు ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నామంటే.. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసినవే అని అన్నారు. దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆలయాలలో భద్రతా ప్రమాణాలను కాపాడుకోవాల్సిన మెరుగుపరచాలని సూచించారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు దేవాలయాలే మూలం అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఆలయాలు అధిక సంఖ్యలో ఉన్నాయని తెలిపారు.
దుర్గ గుడిలో వెండి సింహాల మాయం విషయంలో చాలా వివాదం తలెత్తిందని.. ఈ విషయంలో అనేక విమర్శలు.. ఆరోపణలు వచ్చాయన్నారు. దుర్గమ్మ దయతో ఆ నేరస్తుడిని పట్టుకున్నామని తెలిపారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనతో రాష్ర్టంలో వాతావరణం మారిపోయిందని తెలిపారు. 47734 ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని.. 59443 ఆలయాలను సర్వే చేసి.. వాటికి జియో ట్యాగింగ్ చేశామని వెల్లడించారు. 23,832 ఆలయాల్లో గ్రామ రక్షక దళాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. దేవాలయాలపై దాడులు చేస్తున్న 373మందిని అరెస్ట్ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు దేవాలయాలపై దాడులకు పాల్పడిన 4873 మందిని విచారించామని తెలిపారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.