ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్న సంగతి తెలిసిందే. అయితే.. ఆర్మీ ఆసుపత్రిలో ఉన్న రఘురామ రాజును.. డిశ్చార్జ్ కాగానే వెంటనే అదుపులోకి తీసుకోవాలని, అక్కడి నుంచి గుంటూరు తరలించారని ఏపీ పోలీసులు ప్లాన్ చేశారట. అయితే.. గుట్టు చప్పుడుకాకుండా ఈ ప్రణాళికలు అమలు జరిపేందుకు ప్రయత్నించగా.. ఈ విషయం రఘురామకు తెలియడం.. కోర్టు ధిక్కరణ నోటీసులు ఇప్పించడం జరిగిపోయాయి. ఇదంతా ఎలా జరిగిందని ఆరాతీస్తే.. అసలు విషయం అప్పుడు బయటపడింది.
న్యాయస్థానం తీర్పు ప్రకారం.. ఆర్మీ ఆసుపత్రిలో ఆయన చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ఎంపీనే భరించాలి. అంతేకాదు.. ఆయనకు కల్పించిన భద్రత ఖర్చులు కూడా ఆయనే చూసుకోవాలి. అయితే.. ఈ క్రమంలోనే ఏపీ పోలీసుల విషయం వెలుగులోకి వచ్చిందట. ఆర్మీ దవాఖానాలో ఆయనకు అందించిన వైద్యం తాలూకు బిల్లును రఘురామ చేతికి ఇచ్చారు అక్కడి అధికారులు.
అంతా ఒకే.. కానీ ఒక్క దగ్గర తేడా కొట్టింది. గుంటూరు నుంచి వచ్చిన 15 మంది పోలీసులకు క్యాంటీన్ ఖర్చుల బిల్లు కూడా రఘురామ లిస్టులోనే పడిందట. అదేంటీ..? గుంటూరు నుంచి పోలీసులు రావడమేంటీ? అది కూడా ఆర్మీ ఆసుపత్రికి ఎందుకు వచ్చారు? బిల్లు నా అకౌంట్లో ఎందుకు పడింది? అన్న విషయం ఆరాతీస్తే.. తీగ కదిలిందని చెబుతున్నారు. అంటే.. డిశ్చార్జ్ కాగానే తనను గుంటూరు తీసుకెళ్లడానికి పోలీసులు వచ్చారనే విషయం తెలుసుకున్న ఎంపీ.. తన ప్లాన్ లో తాను మొదలు పెట్టినట్టు చెబుతున్నారు.
మిలటరీ ఆసుపత్రి రిజిస్ట్రార్ గా ఉన్న కేపీ రెడ్డి అనుమతితోనే గుంటూరు పోలీసులు వచ్చారని రఘురామ ఆరోపిస్తున్నారు. ఈ కుట్రలో టీటీడీ జేఈవోగా ఉన్న ధర్మారెడ్డికి సైతం భాగం ఉందని చెబుతన్నారట. వీరిద్దరూ గుంటూరు అర్బన్ ఎస్పీగా ఉన్న అమ్మిరెడ్డి.. మొత్తం ముగ్గురు కలిసి తనపై కుట్ర చేశారని రఘురామ భావిస్తున్నారట. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సైతం ఫిర్యాదు చేశారు. ఆ విధంగా.. ఒక్క చిన్న బిల్లు కాగితం.. బండారం మొత్తం బయటపెట్టిందని, ఏపీ పోలీసులే రఘురామకు సాక్ష్యాల ఆయుధాలను అందిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.