
తిట్టే నోరు.. తిరిగే కాలు ఊరికే ఉండవని సామెత. ఇది అక్షరాలా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు సరిపోతుంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఇక ఆయన నోరు మెదపరని అందరూ అనుకున్నా ఆయన మాత్రం తనకు అడ్డు లేదని నిరూపించుకున్నారు. నోటితో కాకున్నా రాతతోనైనా తనలోని అక్కసును వెళ్లగక్కారు. తన పరిస్థితి ఇలా కావడానికి సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు విన్నవించారు. రెడ్ల ఆధిపత్యంపై తూటా పేల్చారు. తనపై కక్ష కట్టిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నేపథ్యంలో రెడ్డి సామాజికవర్గంపైనే ఆరోపణలు చేశారు. తాజాగా ఆర్మీ ఆస్పత్రిలో రిజిస్ర్టార్ కేపీ రెడ్డితో పాటు మరో ఇద్దరు అధికారులు తనపై కక్షకట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆస్పత్రి నుంచి త్వరగా డిశ్చార్జి చేసేందుకు వైద్యులపై కేపీ రెడ్డి ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. కేపీ రెడ్డితోపాటు టీటీడీ ఏఈవో ధర్మారెడ్డి, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి తనను సీఐడీకి అప్పగించేందుకు కుట్ర పన్నారని అన్నారు. మిలిటరీ ఆస్పత్రిలో మఫ్టీలో పోలీసులు వచ్చి మకాం వేశారని గుర్తు చేశారు. కేపీ రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
డిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యులు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా ఆయన ఊరుకోవడం లేదు. ఓపిక కూడ తీసుకుని కేంద్ర మంత్రుల వద్దకు వెళుతూ ఫిర్యాదులు చేయడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా రెడ్డి సామాజిక వర్గంపైనే ఆరోపణలు చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇంతటితో ఊరుకోకుండా ఇంకా ఎంత హంగామా సృష్టిస్తారోనని అందరు చూస్తున్నారు.
తను మాత్రం అందరిపై ఆరోపణలు చేస్తూ అలజడి సృష్టించే రఘురామ ఆయన విషయంలో మాత్రం అందరు పద్ధతిగా ఉండాలని భావిస్తారు. మాట్లాడకుండానే తనలోని ఉద్దేశాలను లోకానికి తెలిసేలా చేసి మరో చర్చకు దారి తీశారు. పక్కా ప్రణాళికతోనే ఇవన్నీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రఘురామ పేల్చిన బాంబు ఎక్కడి దాకా వెళుతుందోనని ఆందోళనగా ఉన్నారు. కేంద్రమంత్రికి ఫిర్యాదు చేయడంతో అందరు భయపడుతున్నారు. భవిష్యత్తులపై బెంగ పెట్టుకున్నారు.