అమరావతి భూములలో గత ప్రభుత్వం ఇన్‌సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినదని, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన మంత్రులు పి నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులతో పాటు అధికార పక్షానికి చెందిన పలువురు, వారి సహచరులు సహితం పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో విమర్శలు కురిపించారు.
అధికారంలోకి వచ్చాక ఆయా ఆరోపణలను నిర్దుష్టంగా తేల్చి, క్రిమినల్ కేసులు దాఖలు చేయడంలో దిక్కుతోచక వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఎన్ని దర్యాప్తులు జరిపించినా జగన్ కోరుకున్న విధంగా నిర్దుష్టమైన ఆధారాలతో నివేదికలు రాకపోవడంతో ఒక విధంగా అసహనానికి లోనవుతున్నట్లు కనిపిస్తున్నది.
దానితో ప్రజలలో తాను చేసిన విమర్శలపై విశ్వసనీయత కోల్పోవలసి వస్తున్నదని గ్రహించినట్లున్నారు. అందుకనే పరువు కాపాడుకోవడానికి ఈ కేసులను సిబిఐకి అప్పగించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడి అవుతున్నది.
తాజాగా ఆ భూముల లావాదేవీలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం జిఓ జారీచేయడం ఒక విధంగా ప్రభుత్వం నిస్సహాయ ధోరణిని వెల్లడి చేస్తుంది. మొదట ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. తీవ్రమైన ఆరోపణలతో నివేదికను విడుదల చేశారు.
రాజధానిలో 4,000 ఎకరాల కొనుగోళ్లకు సంబంధించి పెద్దఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు ఉపసంఘం కనుక్కుందని.. దాని ఆధారంగా తదుపరి చర్యలకు ఉపక్రమిస్తున్న ట్లు జగన్ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. అంతకు ముందే సిఐడి దర్యాప్తు అన్నారు.
ఈ మధ్య డీఐజీ కొల్లి రఘురాంరెడ్డి నేతృత్వంలో అసాధారణ అధికారాలతో సిట్ ఏర్పాటైంది. ఈ బృందం కొందరు వ్యక్తుల ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. అయితే ఇన్ని చర్యలు తీసుకున్నా.. భూముల క్రయవిక్రయాల్లో కుంభకోణం చోటు చేసుకుందన్న ఆరోపణలకు సంబంధించి ఒక కేసు కూడా నమోదు చేయలేక పోయారు.