ఎర్రకోటపై త్రివర్ణ పతకం ఎగరాల్సిన చోట వేరే జెండా ఎగరటమా? ఇది ఎప్పుడన్నా విన్నామా? చిన్నప్పుడు కమ్యూనిస్టులు ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరేస్తామని స్లోగన్లు ఇస్తే విన్నాము. ఇప్పుడు ఎర్ర జెండా కాకపోయినా కాషాయ జెండా ( ఖల్సా), పచ్చ జెండా ( రైతు సంఘటన ) ఎగరటం టివి ల్లో ప్రత్యక్షంగా చూస్తూ వుంటే ఇది కలనా నిజమా అని నిర్ఘాంత పడి అలానే చూస్తూ వుండి పోయాను. ఇటీవలనే కెనడా నుంచి సిక్కు ప్రవాసీయులు ఢిల్లీలో ఖలీస్తాన్ జెండా ఎగరవేస్తే లక్షల డాలర్లు బహుమతి కూడా ప్రకటించారు. ఇది అందులో భాగమా ? ఏమో చెప్పలేము. అసలు ఇదంతా ఎలా జరిగింది. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాము. ప్రధానమంత్రి ఆగస్టు 15వ తేదీ ఎగరవేసే దిమ్మ మీదే ఈ జెండా ఎగరవేయటం అంటే ఇంతకన్నా దేశానికి అవమానం ఏముంది ? దేశ గౌరవం మంట గలిసింది. ఇది చూస్తూ వుంటే జనవరి 6వ తేదీ రౌడీ మూకలు అమెరికా కాంగ్రెస్ వుండే కాపిటల్ భవనంలోకి చొరబడి స్పీకర్ సీట్లో కూర్చొని టేబుల్ మీద కాలు మీద కాలు వేసుకున్నట్లు గా వుంది. ఈ రెండు సంఘటనలు 20 రోజుల తేడాతో జరిగాయి. అక్కడా ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్ అయ్యింది, ఇక్కడా ప్రభుత్వ యంత్రాంగం గుడ్లప్పగించి చూస్తూ వుంది. రౌడీ మూకలు డిల్లీ నగరంలో స్వైరవిహారం చేస్తుంటే ప్రభుత్వం ఓ నిస్సహాయకురాలిగా ప్రేక్షక పాత్ర వహించింది. దేశమా నీకు రక్షణ లేని అనాధ అయ్యావా ?
జనవరి 26నే ఎందుకు ఎంచుకున్నారు?
రైతు నాయకులకు జనవరి 26వ తేదీనే ఈ ట్రాక్టర్ల ప్రదర్శన చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది. దీనికి సమాధానం దొరికితే మనకు సమస్య మూలాలు అర్ధమవుతాయి. జనవరి 26 ప్రాధాన్యత దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. దానితో పాటు అంతర్జాతీయ మీడియా రిపోర్టర్లకీ ఈ రోజు ప్రాముఖ్యత తెలుసు. షహీన్ బాగ్ అల్లర్లు ఖచ్చితంగా ట్రంప్ డిల్లీ పర్యటనతో ముడిపెట్టినట్లే రైతు ట్రాక్టర్ల ర్యాలీ కూడా ఇంకో అంతర్జాతీయ ప్రాముఖ్యత రోజునే ప్లాన్ చేశారు. ఇదేదో కాకతాళీయంగా జరిగిందని అనుకుంటే పొరపాటు. అందుకనే వెంటనే న్యూయార్క్ టైమ్స్ ముగ్గురు విలేకర్లు కలిసి దీనిపై పెద్ద వ్యాసాన్ని ప్రచురించారు. ఇది కూడా కాకతాళీయంగానే జరిగిందని సర్దిపుచ్చుకుందామా? ఇంతగా కుట్రపూరితంగా దేశ ప్రతిష్టని దెబ్బతీయాలని ప్లాన్ చేస్తే ప్రభుత్వం వాళ్ళ ట్రాప్ లో ఎందుకు పడింది? ఎందుకు గట్టిగా ఆరోజు ప్రదర్శనని అనుమతించమని చెప్పలేకపోయింది? ఇంటలిజెన్స్ వ్యవస్థలు ఎందుకు పసిగట్టలేకపోయినవి? రాజకీయనాయకత్వం ఇంత బలహీనంగా ఉందా? రైతులు కాబట్టి సున్నితంగా వ్యవహరించాలనేది నిజమే, పంజాబ్ రాష్ట్రం సరిహద్దు రాష్ట్రం ఒకసారి ఖలిస్తాన్ ఉద్యమం జరిగిన చరిత్ర వున్న రాష్ట్రం అనేది కూడా నిజమే. అంతమాత్రాన వాళ్ల అరాచకానికి అవకాశం ఇవ్వాలా? ఆ మాత్రం సందేహం రాలేదా?
ఒకవైపు ప్రభుత్వమే చెబుతుంది ఈ ఉద్యమానికి ఒక నాయకుడంటూ లేడని. అటువంటప్పుడు రైతు నాయకులు ఇచ్చిన భరోసా ను గుడ్డిగా ప్రభుత్వం ఎందుకు నమ్మింది? ఈ మొత్తం వ్యవహారంతో ప్రభుత్వ యంత్రాంగం లో వున్న లోపాలు అందరికీ తెలిశాయి. గూడచారివర్గాలకి అంతంత డబ్బులిచ్చి పెంచి పోషించేది ఎందుకు? డీప్ సిద్దూ కదలికలపై నిఘా లేదా? వుగ్రవాన్ కిసాన్ యూనియన్ పై సమాచారం లేదా? చానళ్లలో ప్రతిరోజూ వీళ్ళ కార్యక్రమాల గురించి కధనాలు వస్తుంటే ప్రభుత్వానికి మరింత లోతైన సమాచారం లేదా? ఎన్ఐఎ కొంతమందిని విదేశీ నిధులపై ప్రశ్నించాలని పిలిపిస్తే రాకపోతే ఎందుకు వుపేక్షించారు? రైతు నాయకులు, కొన్ని మీడియా చానళ్ళు ఇది కక్ష సాధింపు చర్య అనగానే భయపడిపోయి వాళ్ళను ప్రశ్నించకపోవటాన్ని ఏమనాలి?
రైతు నాయకులు అసలు ఈరోజునే ప్రదర్శన చేయాలని పట్టుపట్టటం వెనక ఆంతర్యం ఏమిటి? చానళ్లలో ఆ రోజు ఎటువంటి గొడవలు జరగవని హామీ ఇవ్వటం, పోలీసులకు భరోసా ఇవ్వటాన్ని ఏవిధంగా అర్ధం చేసుకోవాలి? అదే యోగేంద్ర యాదవ్, హన్నన్ ముల్లాలు ఈ రోజు పోలీసులను తప్పుపట్టటంలో ఏమైనా ఔచిత్యం ఉందా? డీప్ సిద్దూ తో మాకు సంబంధం లేదని ఇప్పుడు చెబుతున్నవారు పోలీసులకు తనగురించి ఏమైనా ఉప్పు అందించారా? లేకపోతే ఎందుకని మౌనంగా వున్నారు? అలాగే కిసాన్ మజ్దూర్ సంఘటన తో మాకు సంబంధం లేదని చెబుతున్న వీరు వాళ్ళను మీ సమావేశాలకు ఎందుకు అనుమతిస్తున్నారు? బారికేడ్లు తొలగించి లోపలకి వచ్చిన ట్రాక్టర్లలో సిపిఎం జెండా కట్టిన ట్రాక్టరు కూడా కనబడుతుంది కదా? మరి ఆ జెండాలు కూడా వేరే వాళ్ళు కట్టుకొని వచ్చారా? అసలు ఈ సంఘటనపై అన్నీ ప్రశ్నలే. ప్రభుత్వం, ప్రతిపక్షాలు, రైతు సంఘాలు అన్నీ వాళ్ళ ముఖాలు ఒక్కసారి అద్దంలో చూసుకుంటే వాళ్ళ వికృతరూపం వాళ్ళకే అసహ్యం వేస్తుంది. ఎర్రకోటపై ఎక్కి తాండవం చేసిన ఈ రౌడీ మూకలు వీళ్ళ వికృత రూపాల్ని, చేతకానితనాన్ని అద్దంలో చూపిస్తున్నాయి.
ఇప్పుడు ఏమి చేయాలి?
ఇప్పటికైనా ప్రభుత్వం మత్తు వదిలి తన బాధ్యతల్ని నెరవేర్చాలి. అసలు మీరు రైతు చట్టాల్ని ఒకటిన్నర సంవత్సరం వాయిదా వేయాలనుకోవటమే పెద్ద వ్యూహాత్మక తప్పిదం. అంత ధైర్యం లేనప్పుడు అసలు సాహసించ కూడదు. ఈ సంస్కరణలు దేశ వ్యవసాయరంగానికి అవసరమనే కదా తీసుకొచ్చింది. ఒకటిన్నర రాష్ట్ర రైతులు వద్దంటే ఆపేస్తారా? మిగతా రైతుల పరిస్థితి ఏమిటి? వరి, గోధుమ పండించే వాళ్ళే రైతులా, అదీ పంజాబ్, హర్యానాలో మాత్రమే ? మిగతా రైతులు రైతులు కాదా? ఇంత బలహీనమైనదా రాజకీయ నాయకత్వం? ఇప్పటికైనా ఈ రైతు నాయకులతో కఠినం గా వ్యవహరించండి. ప్రజలకు మీరు జవాబుదారి, వీళ్ళు కాదు. మార్కెట్ సంస్కరణలు ఎప్పుడైనా కష్టమే. ఇప్పుడు చేయలేకపోతే ఒకటిన్నర సంవత్సరాల తర్వాత అసలు చేయలేరు. సాధారణ ఎన్నికల ముందు సంస్కరణలు చేయలేరు. ఇదే సరైన సమయం. ఆర్ ఎస్ ఎస్ ఒత్తిడి మోడీ ప్రభుత్వం పై వుందని తెలుస్తుంది. ఇది సరైనది కాదు. ప్రభుత్వం ఏ విధానాలు తీసుకోవాలో నిర్ణయించాల్సింది ఎన్నికైన ప్రభుత్వం. అదే ప్రజలకు జవాబుదారి. ప్రతిపక్షాలు మన దేశంలో బాధ్యతారాహిత్య పాత్ర పోషిస్తున్నాయి. వాటిని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. అనుకున్న పనులు ధైర్యంగా చేయగలిగితే ప్రజలు హర్షిస్తారు. ముందుగా నిన్న జరిగిన దేశ వ్యతిరేక సంఘటనకు బాధ్యులైన వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేయాలి. కఠిన శిక్షలు పడేటట్లు చూడాలి. అలాగే రైతు చట్టాల్ని సమర్ధించే రైతు సంఘాలు చురుకుగా వుండాలి. గత ఆరు దశాబ్దాల నుంచి రైతులకు స్వేచ్చ కావాలని పోట్లాడిన సంఘాలు ఇప్పుడు మౌనంగా ఆమోదించటం కాదు. యాక్టివ్ గా కదలాలి. వాస్తవానికి ఎక్కువమంది రైతులు ఈ చట్టాలకి మద్దత్తు నిస్తున్నారు. కాని వాళ్ళది సైలెంట్ మెజారిటీ అయ్యింది. మైనారిటీగా వున్న సంఘాలు రోడ్లమీద హడావుడి ఎక్కువ చేస్తున్నాయి. వాళ్లకు ప్రభుత్వం లొంగుతుంది. ఇదో విచిత్ర పరిస్థితి. విస్తృత ప్రజామోదంతో ఎన్నికైన ప్రభుత్వం, సైలెంట్ మెజారిటీ రైతులు అండ వున్నా మైనారిటీ రైతులు ప్రభుత్వాన్ని లొంగదీసు కుంటున్నారు. ఈ పరిస్థితి మారాలి. ప్రభుత్వం గట్టిగా వుండాలి. సైలెంట్ మెజారిటీ యాక్టివ్ మెజారిటీగా మారాలి. అప్పుడే రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుంది.